ఏం ఖుషీ చేసినావ్ కేసీఆర్...

August 01, 2020

ఓ పాలకుడు, అది కూడా కాస్తంత మొండిఘటంగా కనిపించే పాలకుడు కరుణిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే... తెలంగాణను ఓ సారి చూస్తే ఇట్టే అర్థమైపోతుందని చెప్పవచ్చు. నిన్నటిదాకా ఆర్టీసీ కార్మికులపై కస్సుబుస్సు మన్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు... కార్మికులు ఓ మెట్టు దిగిరాగానే... వారిపై కరుణా కటాక్షాలు చూపించిన కేసీఆర్... కార్మికులు అడిగిన సమస్యలను పక్కనపెట్టేసి... వారు ఊహించని విధంగా వారు అడగని వరాలను కూడా కురిపించి వారితో పాటు జనాన్ని కూడా ఆశ్చర్యంలో ముంచేశారని చెప్పక తప్పదు.

52 రోజుల పాటు సమ్మె కొనసాంచిన ఆర్టీసీ కార్మికులు... ఇకపై సమ్మె కొనసాగించడం తమ వల్ల కాదని కేసీఆర్ ను శరణువేడినంత పనచేశారు. దీంతో వారిపై కరుణ చూపిన కేసీఆర్... సరే సరే... ఇక విధుల్లో చేరండంటూ ప్రకటించారు. అంతేనా... ఆర్టీసీ కార్మికులు అంటే తనకేమీ కోపం లేదని ఓ సంచలన ప్రకటన చేసిన కేసీఆర్... వారిని ప్రగతి భవన్ కు పిలిచి భోజనం పెట్టి మాట్లాడతానని కూడా ప్రకటించారు. అనుకున్నట్లుగానే ఆదివారం ఆర్టీసీ కార్మికులను ప్రగతి భవన్ కు పిలిపించిన కేసీఆర్.. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత కార్మికులతో ముఖాముఖీ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కార్మికులపై వరాల జల్లు కురిపించారు. 

ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతామని, ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తే సింగరేణి తరహా బోనస్ ఇస్తామని, 52 రోజుల పాటు చేసిన సమ్మె కాలానికి సంబంధించి కార్మికులకు జీతాలు చెల్లిస్తామని, మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మహిళల కోసం డిపోల్లో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని, సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను కార్మికులకు తక్షణమే (సొమవారమే) చెల్లించాలని, బస్సులో ప్రయాణికులు టికెట్ తీసుకోకపోతే కండక్టరుకు మాత్రమే విధిస్తున్న పెనాల్టీని ఇకపై ప్రయాణికులకూ విధించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంతదాకా బాగానే ఉన్నా... చివరలో ఆర్టీసీకి చెందిన 50 శాతం రూట్లను ప్రైవేట్ కు కేటాయిస్తామని సమ్మె సమయంలో తాను చేసిన ప్రకటనను కేసీఆర్ వెనక్కు తీసుకున్నారు. ఆర్టీసీకి చెందిన రూట్లలో ఏ ఒక్క దానిని కూడా ప్రైవేట్ కు కేటాయించేది లేదని కూడా కేసీఆర్ ప్రకటించారు. మొత్తంగా తాను ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు... ఇప్పుడు తన ముందు మోకరిల్లడంతో కేసీఆర్.. పూర్తిగా రివర్స్ లో ప్రకటనలు గుప్పించారన్న మాట.