ఛాన్సు దొరికంది... కేసీఆర్ పండగ చేసుకున్నాడు

August 14, 2020

తెలంగాణలో వేలాది మంది కార్మికుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్మేసిన ఆర్టీసీ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. తమను పొరుగు రాష్ట్రం ఏపీలో మాదిరి ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చిన కార్మికులకు డెడ్‌లైన్ ఇచ్చి.. ఆలోగా విధుల్లోకి రానివారంతా ఉద్యోగాలు కోల్పోయినట్లేనని ప్రకటించిన సీఎం కేసీఆర్ తన నియంతృత్వ నిర్ణయంతో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. కేసీఆర్ నిర్ణయంతో 48 వేల మంది కార్మికులు రోడ్డనపడే పరిస్థితి. అయినా, కేసీఆర్ అదేమీ పట్టించుకోకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొద్దిపాటి కార్మికులతో ఆర్టీసీని కొనసాగిస్తామని, మిగతావి అద్దెబస్సులు తిప్పుతామని, మరికొంత ప్రైవేటీకరిస్తామని ప్రకటించేశారు. కేసీఆర్ బెదిరింపులకు, మొండిపట్టుకు ఆర్టీసీ కార్మికులేమీ బెదిరిపోలేదు. తమ సమ్మెను కొనసాగిస్తున్నారే కానీ విధుల్లోకి రాలేదు. అయితే.. కేసీఆర్ ఈ సమస్య పరిష్కారానికి కానీ, చర్చలకు కానీ గట్టిగా ప్రయత్నించకుండా ఆర్టీసీని కొంతవరకు ప్రయివేటీకరించడం, మరకొంత అద్దెబస్సులు తిప్పడం అన్న నిర్ణయానికి రావడం వెనుక ప్రధాన కారణం ఒకటుందని వినిపిస్తోంది. హైదరాబాద్ మెట్రోకు లబ్ధి చేకూర్చడానికే కేసీఆర్ ఆర్టీసీని నాశనం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం నష్టాల్లో నడుస్తోంది. లాభాల బాట పట్టే అవకాశమూ కనిపించడం లేదు. సిటీలో ఆర్టీసీ బస్సు ప్రయాణానికి, మెట్రోకు మధ్య సమయంలో కానీ, ధరలో కానీ, సౌకర్యంలో(ఏసీ బస్సులు పరిగణనలోకి తీసుకుంటే) కానీ పెద్ద వ్యత్యాసం లేకపోవడంతో మెట్రోకు ఆదరణ లేకుండా పోయింది. దీంతో మెట్రో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో హైదరాబాద్ నగరం వరకు ఆర్టీసీని బలహీనం చేసి మెట్రోకు ఆదరణ పెంచాలని యోచిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆ వ్యూహాల్లో భాగంగానే ఆర్టీసీని నీరుగార్చే పని పెట్టుకున్నారని.. తొలుత నగరంలో ఆర్టీసీ లేకుండా చేస్తే రోడ్లపై రద్దీ తగ్గడంతో పాటు మెట్రోకు రద్దీ పెరుగుతుందన్నది ఉద్దేశంగా తెలుస్తోంది. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ఇబ్బందుల్లేకుండా అద్దెబస్సులు తిప్పాలనుకుంటున్నారట. మరోవైపు కార్మికులతో సమస్య పరిష్కారమై వారు విధుల్లోకి వచ్చినా కూడా హైదరాబాద్‌లో ఆర్టీసీని దాదాపుగా లేకుండా చేద్దామనే అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ వ్యతిరేకత వచ్చిన పక్షంలో మెట్రో మార్గాల్లో బస్సులను తగ్గించేసి నీరుగార్చేస్తారని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు.