జగన్ కి స్ట్రోక్... టీడీపీయే బీసీ హీరో, అసెంబ్లీలో కేసీఆర్

May 29, 2020

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శనివారం వెల్లడించారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ ఉంటుంది. ఈ దశలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బీసీలు దూరమయ్యారనే వాదనల నేపథ్యంలో చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే కేసీఆర్ నోటి నుండి టీడీపీకి అనుకూలంగా మాటలు వచ్చాయి.

సమావేశాల సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఇది వాస్తవమని, ఆ సమయంలో తనతో సహా చాలామంది టీడీపీలోనే ఉన్నారని, ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని అభిప్రాయపడ్డారు. అప్పటి వరకు కాంగ్రెస్ చాలాకాలం పాలించిందని, కానీ బీసీలకు మాత్రం న్యాయం చేయలేకపోయిందన్నారు.

కాంగ్రెస్ పీరియడ్‌లో మాజీ సంస్ధానాదీశులు, గడీల దొరలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వర్ధిల్లారని, నాడు వీరికాలంలో బీసీలు ఎక్కడున్నారో అందరికీ తెలుసునని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీస్తే గద్వాల రాజులు, వనపర్తి రాజులు, ఇటిక్యాల దొరలు, మహబూబాబాద్ దొరలు.. వీళ్లే ఎంపీలు, ఎమ్మెల్యేలు అని దుయ్యబట్టారు. వీటిని తాము చూశామని, ప్రేక్షకులుగా ఏమీ లేమన్నారు.

ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే జగన్ - కేసీఆర్‌ను మిత్రులుగా భావిస్తారు. కేసీఆర్ వ్యాఖ్యలు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి ఏ మేరకు పని చేస్తాయనే అంశాన్ని పక్కన పెడితే.. బీసీలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ అనే వ్యాఖ్యలు మాత్రం ఆ పార్టీకి ఊరట కలిగించే అంశం.