ఇవాళ కేసీఆర్ ప్రెస్ మీట్ ... హైలైట్ ఎవరు?

May 27, 2020

రోటీన్ కు భిన్నంగా వ్యవహరించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే ఎవరైనా. కీలక నిర్ణయాల్ని నిర్మోహమాటంగా తీసుకోవటంలో ఆయన ముందుంటారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ ను మరింత కాలం పొడిగించాలన్న ప్రతిపాదనను దేశంలోనే తొలిసారి తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా చెప్పాలి. కరోనాకు ముందు లేని వేళ.. భారత్ లాంటి దేశంలో లాక్ డౌన్ కొనసాగింపు మినహా మరో మార్గం లేదని ఆయన తేల్చి చెబుతున్నారు.
లాక్ డౌన్ వేళ పేదలు.. బలహీన వర్గాలకు అందాల్సిన సాయం గురించి.. దారుణంగా పడిపోయిన రాష్ట్ర ఆదాయం గురించి నిత్యం చర్చల మీద చర్చలు జరుపుతున్న సీఎం కేసీఆర్.. ఈ రోజు రాత్రి ప్రెస్ మీట్ పెట్టనున్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై తన నిర్ణయాన్ని కేసీఆర్ వెల్లడించనున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ పొడిగింపు మినహా మరో మార్గం లేదన్న సారు వాదనకు తగ్గట్లే.. ఒడిశా.. పంజాబ్ ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ సైతం తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.
కరోనా నేపథ్యంలో తరచూ మీడియా సమావేశాల్ని నిర్వహిస్తున్న కేసీఆర్.. పనిలో పనిగా కరోనా శాపాలు పెట్టేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. కరోనా లాంటి సంక్షోభ సమయంలో చూసిచూడనట్లుగా ఉండాలని.. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకూడదన్న మాటను చెబుతున్న ఆయన.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న వారి తీరును తీవ్రంగా తప్పు పడుతూ తిట్ల దండకాన్ని అందుకుంటున్నారు.
కొందరి తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అలాంటి వారికి కరోనా తగులుకోవాలంటూ శాపాన్ని పెట్టేస్తున్నారు. తాజా ప్రెస్ మీట్ లో కరోనా శాపం ఎవరికి తగులుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మొన్నటికి మొన్న మాస్కులు.. కిట్లు కొరతతో ఉందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై సీరియస్ అయిన ఆయన.. శాపాలు మాత్రమే కాదు తీవ్రమైన వార్నింగ్ కూడా ఇచ్చేయటం తెలిసిందే. ఈ రోజు ప్రెస్ మీట్ లో ఎవరు టార్గెట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.