దెబ్బకు కేసీఆర్ భ్రమలు వదిలిపోయాయి

May 26, 2020

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ దేశంలోని చాలా రాష్ట్రాల‌ను చుట్టేస్తున్న టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుకు నిన్న త‌మిళ‌నాట డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తో జరిగిన భేటీ గ‌ట్టి షాకే ఇచ్చింద‌ని చెప్పాలి. అప్ప‌టిదాకా బీజేపీయేత‌ర‌తో పాటు కాంగ్రెసేత‌ర ప‌క్షాలంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్‌... స్టాలిన్ కొట్టిన దెబ్బ‌కు... ఇప్పుడు బీజేపీయేత‌ర ప‌క్షాలేన‌ని మాత్ర‌మే చెబుతున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఊత‌ప‌దంలోని కాంగ్రెసేత‌ర అనే ప‌దం ఇక‌పై వినిపించే ఛాన్సే క‌నిపించ‌డం లేదు. ఈ మేర‌కు గులాబీ ద‌ళప‌తి ఇప్ప‌టిదాకా ర‌చించుకున్న త‌న వ్యూహానికి మార్పులు చేర్పులు చేసేస్తున్నారు.

ఇందులో భాగంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు తగినంత మేర సీట్లు రాక‌పోతే... బ‌య‌టి నుంచి కాంగ్రెస్ మ‌ద్ద‌తిస్తే... దానిని అంగీక‌రించేందుకు కేసీఆర్ మాన‌సికంగా సిద్ధం అయిపోతున్నారు. ఈ కొత్త వ్యూహంలో భాగంగా నేరుగా తాను కాకుండా త‌న పార్టీ నేత‌ల నుంచి కొత్త ప్ర‌క‌ట‌న‌లు ఇప్పిస్తున్నారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ అధికార ప్ర‌తినిధి అబిద్ ర‌సూల్ ఖాన్‌... ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు సంబంధించిన న‌యా వ్యూహంపై జాతీయ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్‌తో మాట్లాడిన సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో జోరు పెర‌గ‌నుంద‌ని... త‌మ పార్టీ ఆధ్వ‌ర్యంలో తెర‌మీద‌కు వ‌చ్చే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు బీఎస్పీతో పాటు ఎస్పీ, తృణ‌మూల్ కాంగ్రెస్‌, వైసీపీలు జ‌త క‌లుస్తాయ‌ని ర‌సూల్ చెప్పుకొచ్చారు. త‌మ‌కు ద‌క్కే సీట్ల‌ను చూసిన త‌ర్వాత ఫ్రంట్ కు మ‌రిన్ని పార్టీలు మ‌ద్ద‌తు ల‌భించ‌డం కూడా ఖాయ‌మేన‌ని ఆయ‌న చెప్పారు.

అప్ప‌టికీ మెజారిటీ త‌గినంత మ‌ద్ద‌తు లేక‌పోతే... కాంగ్రెస్ పార్టీ బ‌య‌టి నుంచి మ‌ద్ద‌తిచ్చేందుకు ఓకే అంటే... హ‌స్తం పార్టీ మ‌ద్ద‌తును స్వీక‌రించేందుకు తాము కూడా సిద్ధ‌మేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తే... ఒక‌వేళ బీజేపీ గ‌నుక ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు మ‌ద్దతిచ్చేందుకు సిద్ధ‌మైనా తాము మాత్రం తీసుకునే ప్ర‌స‌క్తే లేద‌ని కూడా ఆయ‌న తేల్చిపారేశారు. అంటే... స్టాలిన్ తో భేటీ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీపై ఉన్న ద్వేషాన్ని ఉన్న‌ప‌ళంగానే త‌గ్గించేసుకున్న కేసీఆర్‌... బీజేపీపై వ్య‌తిరేక‌త‌ను మాత్ర‌మే కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ర‌సూల్ వ్యాఖ్య‌ల్లోని అంత‌రార్థం కూడా ఇదేన‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.