ఈనాడుపై కేసీఆర్ మొదటి రివెంజ్ ఇది

May 28, 2020

తెలంగాణ రాష్ట్రంలో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. ఉద్య‌మ నేప‌థ్య‌మున్న పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ ఎక్కువ‌గా ఉంటుంద‌ని.. ప్ర‌జాస్వామ్యంలో నాలుగో స్థంభ‌మైన మీడియా స్వేచ్ఛ‌కు మ‌రింత ఎక్కువ అవ‌కాశం ఉంటుంద‌న్న భ్ర‌మ‌లు క‌రుగుతున్న వేళ‌.. అదెంత నిజ‌మో తాజా ప‌రిణామం స్ప‌ష్టం చేస్తుంద‌ని చెప్పాలి. మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్ విడుద‌ల చేసిన ఒక ఆదేశం ఇప్పుడు షాకింగ్ గా మాత్ర‌మే కాదు.. మీడియా వ‌ర్గాల్లో పెను సంచ‌ల‌నంగా మారింది.
స్థానికంగా ఉండే విలేక‌రి మొద‌లు చీఫ్ రిపోర్ట‌ర్ అంత‌కంటే అత్యున్న‌త స్థానాల్లో ప‌ని చేసే రిపోర్ట‌ర్ల‌కు.. డెస్క్ లో ప‌ని చేసే కొంద‌రు ముఖ్యుల‌కు మీడియా అక్రిడేష‌న్ కార్డుల్ని ప్ర‌భుత్వం జారీ చేస్తుంటాయి. ఫ‌లానా మీడియా సంస్థ‌లో ప‌ని చేసే రిపోర్ట‌ర్ గా ప్ర‌భుత్వం గుర్తింపు ఇవ్వ‌టంతో పాటు.. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌టానికి ప్ర‌త్యేక అనుమ‌తి అవ‌స‌రం లేకుండా వీటిని జారీ చేస్తుంటారు. ఈ గుర్తింపు కార్డులో మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు ఉంటాయి.
ప్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన ఆర్టీసీలో ఉచితంగానూ.. 1/3 ఛార్జీని చెల్లిస్తే స‌రిపోయేలా రాయితీ క‌ల్పిస్తారు. ఇదే కాకుండా.. ట్రైన్ల‌లో 50 శాతం రాయితీ ఇస్తుంటారు. ఆరోగ్య బీమాతో పాటు.. కొన్ని ప్ర‌యోజ‌నాలు క‌ల్పించే అవ‌కాశం మీడియా అక్రిడేష‌న్ తో ల‌భిస్తుంటుంది. రిపోర్ట‌ర్లుగా పెద్ద ఎత్తున ప‌ని చేస్తున్నా.. ఈ అక్రిడేష‌న్ అంద‌రికి కాకుండా కొద్దిమందికే ప్ర‌భుత్వం ఇస్తుంటుంది. దీంతో.. ఈ కార్డు కోసం మీడియా సంస్థ‌ల్లో ప‌ని చేసే వారు ఆస‌క్తిని చూపిస్తుంటారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈనాడుకు చెందిన స్టాఫ్ రిపోర్ట‌ర్ భానుచంద‌ర్ రెడ్డి హైద‌రాబాద్ సిటీ బ్యూరోలో ప‌ని చేస్తుంటార‌ని చెబుతుంటారు. హెచ్ ఎండీ బీట్ తో పాటు.. మ‌రికొన్ని శాఖ‌లు ఆయ‌న క‌వ‌ర్ చేస్తుంటారు. అలాంటి ఆయ‌న ఆ మ‌ధ్య‌న ఒక వార్త రాశారు. అదేమంటే.. తార్నాక‌లోని హెచ్ ఎండీ కార్యాల‌యాన్ని అమీర్ పేట‌కు మారుస్తున్నార‌ని.. ఈ మార్పు వెనుక కొంత మాయాజాలం ఉందంటూ విమ‌ర్శ‌నాత్మ‌కంగా క‌థ‌నం రాశారు. ఏప్రిల్ 14న రాసిన ఈ క‌థ‌నం రిపోర్ట‌ర్ అక్రిడేష‌న్ కార్డును ర‌ద్దు చేస్తూ.. మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్ నిర్ణ‌యం తీసుకోవ‌ట‌మే కాదు.. అధికారికంగా ఆదేశాలు జారీ చేసిన వైనం కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.
ఎవ‌రైనా ఒక రిపోర్ట‌ర్ ఒక వార్త‌లో త‌ప్పు రాస్తే.. దాన్ని ఖండిస్తూ స‌ద‌రు వ్య‌క్తులు కానీ సంస్థ‌లు కానీ రిజాయిండ‌ర్ ను రిలీజ్ చేయ‌టం.. వాటిని ప‌బ్లిష్ చేయ‌టం మీడియాలో క‌నిపిస్తూ ఉంటుంది. కొన్నిసంద‌ర్భాల్లో మాత్రం వార్త రాసిన విలేక‌రి హ‌ద్దులు దాటేలా ఆరోప‌ణ‌లు రాసినా.. నిజాలేమీ లేకుండా ప‌చ్చి అబ‌ద్ధాలు మాత్ర‌మే రాస్తే దానిపై కోర్టుకు వెళ్ల‌టం క‌నిపిస్తుంది. అంతేకాదు.. వార్త రాసిన ఫ‌లానా రిపోర్ట‌ర్ అక్రిడేష‌న్ కార్డును క్యాన్సిల్ చేస్తున్నామంటూ అధికారిక ఆదేశాలు జారీ చేయ‌టం క‌నిపించ‌దు. తాజాగా ఆ లోటు తెలంగాణ ప్ర‌భుత్వంలో తీరిపోయింది.
ఒక వార్త త‌ప్పు అయితే.. దాని మీద పోరాడే తీరు.. త‌ప్పును ఎత్తి చూపే విధానాలు చాలానే ఉన్నాయి. వాటిని వ‌దిలేసి.. భ‌య‌పెట్టేలా చ‌ర్య‌లు తీసుకోవ‌టం క‌నిపించ‌దు. అందుకు భిన్నంగా తెలంగాణ అధికారులు తీసుకున్న చ‌ర్య‌లు వ్య‌వ‌స్థ‌కు రాంగ్ సిగ్న‌ల్స్ ఇచ్చేలా ఉన్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో నెగిటివ్ వార్త అన్న‌ది రాయ‌టానికి క‌లం వీరులు వ‌ణికిపోయే ప‌రిస్థితులు రానున్నాయా? అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.