ఆ మంత్రికి కేసీఆర్ చెక్ పెడుతున్నారా..?

July 11, 2020

రాష్ట్ర మంత్రి, మేడ్చెల్ ఎమ్మెల్యే చామ‌కూర మ‌ల్లారెడ్డిపై సీఎం కేసీఆర్ ఫోక‌స్ చేశార‌ట‌. త్వ‌ర‌లోనే ఆయ‌న‌ను మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించ‌నున్నార‌ని గులాబీ పార్టీలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కేసీఆర్ రెండోసారి అధి కారంలోకి వ‌చ్చాక ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మ‌ల్లారెడ్డిని త‌న కేబినెట్‌లోకి తీసుకున్న కేసీఆర్‌, ఆయ‌న‌కు కార్మిక‌, ఉపాధి క‌ల్ప‌న‌, మ‌హిళా, శిశుసంక్షేమ శాఖ‌ను అప్ప‌గించారు. అయితే శాఖాప‌రంగా ఆయ‌న ప‌నితీరు సంతృప్తిక‌రంగా లేక‌పోవ‌డంతో మ‌ల్లారెడ్డిని మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం.
విద్యాసంస్థ‌ల అధినేత‌గా, వ్యాపార‌వేత్త‌గా గుర్తింపు పొందిన చామ‌కూర మ‌ల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ స్థానానికి పోటీ చేసి  విజ‌యం సాధించారు. అయితే రెండేళ్ల‌కే టీడీపీకి రాజీనామా చేసి, 2016 జూన్‌లో టీఆర్ఎస్‌లో చేరారు. అనంత‌రం 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఎంపీగా ఉన్న మ‌ల్లారెడ్డిని  మేడ్చెల్ అసెంబ్లీకి పోటీ చేయించారు కేసీఆర్‌. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన మ‌ల్లారెడ్డిని కేబినెట్‌లోకి తీసుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేశారు  కేసీఆర్‌.
ఈక్ర‌మంలోనే ముఖ్య‌మంత్రికి కేసీఆర్‌కు మ‌ల్లారెడ్డి అత్యంత స‌న్నిహితుడిగా మెలిగారు. అయితే రానురాను ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చింది. త‌న ప్ర‌వ‌ర్త‌న‌, వ్యాఖ్య‌లతోపాటు కార‌ణ‌మేదైనా మ‌ల్లారెడ్డిని ఇటీవ‌లి కాలంలో సీఎం కేసీఆర్  ప‌క్క‌న బెడుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ యేడాది జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కూడా కేసీఆర్ మ‌ల్లారెడ్డి అల్లుడికి మ‌ల్కాజ్‌గిరి ఎంపీ సీటు ఇచ్చారు. రేవంత్‌రెడ్డిని ఓడించేందుకు కేసీఆర్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సీటు ఇచ్చినా అక్క‌డ టీఆర్ఎస్ ఓడిపోవ‌డం కూడా కేసీఆర్ అసంతృప్తికి మ‌రో కార‌ణం.
వాస్త‌వానికి మొద‌టి నుంచి పార్టీలో ఉన్న వారిని కాద‌ని, మ‌ల్లారెడ్డికి మంత్రి ప‌ద‌వి అప్ప‌గించిన‌ప్ప‌టి నుంచే సీనియ‌ర్లు ఆయ‌న పై గుర్రుగా ఉన్నారు. అంతేగాక ఇటీవ‌ల మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా నుంచి స‌బితా ఇంద్రారెడ్డిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఈనేప‌థ్యంలోనే ఒకే జిల్లా నుంచి ఇద్ద‌రు మంత్రులు ఉండ‌టం... అది కూడా ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం కూడా పార్టీకి శ్రేయ‌స్క‌రం కాద‌ని, సీనియ‌ర్ నేత‌ల్లో కూడా అసంతృప్తికి ఆజ్యం పోస్తుంద‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఇక మ‌ల్లారెడ్డికి చెక్ పెట్టాల‌ని ఆయ‌న యోచిస్తున్న‌ట్లు అధికార పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఆ చెక్ ఉద్వాస‌న రూపంలో ఉంటుందా ?  మ‌రోలా ఉంటుందా ? అన్న‌ది చూడాలి.