చంద్రబాబు పాత్ర ఏంటో... కేసీఆర్ కు ఇప్పుడర్థమైంది

May 30, 2020

తెలుగు నేతల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించగలిగిన సత్తా ఎవరికుందంటే.... బహుశా రాజకీయ విశ్లేషకులు అంతా చంద్రబాబు పేరే చెబుతారు. భాష ఒకడి సత్తాకు ఎపుడూ అడ్డం కాదు. కేసీఆర్ కు హిందీ ఇంగ్లిష్ బాగా వచ్చినంత మాత్రాన జాతీయ స్థాయిలో కీలక పాత్ర దక్కితే... ఇంకా ఇతర భాషలు కూడా వచ్చిన కేఏ పాల్ కు ఎలాంటి ప్రాధాన్యత దక్కాలి మరి. భాష అనేది రాజకీయాలకు కొలమానమే కాదు. కేసీఆర్ చెప్పే కబుర్లు కొందరు అమాయకులు నమ్మవచ్చు గాని జాతీయ నాయకులు నమ్మే పరిస్థితి లేదు.

1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు ఎప్పటికపుడు జాతీయ నాయకులతో ఆయన సత్సంబంధాలు నెరపుతూనే ఉన్నారు. కేసీఆర్ ఈరోజు తన అవసరం కోసం వీళ్లందరి వద్దకు వెళ్లాడు. కానీ వారికి అవసరం ఉన్నపుడు కూడా చంద్రబాబు వారికి అండగా ఉన్నాడు. మోడీ బెంగాల్ లో వేషాలేసినపుడు కేసీఆర్ ఒక్క మాట కూడా మమతకు మద్దతుగా మాట్లాడలేదు. కానీ చంద్రబాబు పూర్తిస్థాయిలో మమతకు మద్దతు ఇచ్చారు. తమిళనాడులో కూడా మోడీ డీఎంకే తనతో రానందుకు బాగా ఇబ్బంది పెట్టాడు. ఎన్నికల కమిషన్ పై డీఎంకే - టీడీపీ ఒకే విధంగా పోరాడుతున్నాయి. ఈవీఎంలపై కూడా డీఎంకేకు అనుమానాలున్నాయి. కానీ అన్నింటా మోడీకి మద్దతు పలికి ఇపుడు మాత్రం మెల్లగా పక్కకు జరిగి ఏకంగా ప్రధానో ఉప ప్రధానో అయిపోదాం అని కలలు కంటున్నాడు కేసీఆర్.
తెలంగాణలో మీడియాతో సంబంధాలు నెరపరు. ఎవరినీ కలవడు. ఫాంహౌస్ నుంచి అధికారం చెలాయిస్తే పరిచయాలు పెరుగుతాయా? దేశ రాజకీయాల్లో సహనం, ఎదుటి వారి వద్ద అవసరమైనపుడు తగ్గడం, సఖ్యతగా మెలగడం వంటి లక్షణాలేవీ లేకుండా నెంబర్ ఉన్నంత మాత్రాన రాజకీయాలు సాధ్యమవుతాయా? పైగా కేసీఆర్ వద్ద ఉన్నది 16 సీట్లు. అందులో ఎన్ని వస్తాయో ఎవరికీ తెలియదు.
ఈ నేపథ్యంలో ఏ పార్టీ కూడా దేశంలో అతని మాట వినే పరిస్థితి లేదు.
కేసీఆర్ స్వయంగా వెళ్లి కలిసినా ఆయన ప్రతిపాదనకు నో చెప్పిన స్టాలిన్.. చంద్రబాబు వద్దకు మాత్రం తమ మనిషిని పంపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది కూడా కేసీఆర్ బేటీ జరిగిన మరుసటి రోజే.
దీన్ని బట్టి చూస్తే జాతీయ స్థాయిలో కేసీఆర్ కంటే చంద్రబాబుదే పై చేయి అని అర్థమవుతుంది. ప్రాంతీయ పార్టీలకు బాబుపై ఎక్కువ నమ్మకమని తెలుస్తోంది. ఇదివరకు కూడా కేసీఆర్ మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, నవీన్ పట్నాయక్‌లను కలిస్తే ఎవరి వద్ద నుంచి ఆయనకు స్పష్టమైన హామీ లభించలేదు. పైగా వారంతా చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.
**అప్పుడైనా.. ఇప్పుడైనా.. ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పిందేమి లేదు** అని గతంలో కేసీఆర్‌ అన్న మాట తెలుసు కదా. చంద్రబాబు చక్రం తిప్పడం వల్లే.. కేసీఆర్‌తో ఎవరూ కలవడం లేదని ఇపుడు కేసీఆర్ కు తాజాగా అర్థమై ఉంటుంది.

కాంగ్రెస్ - బీజేపీ రహిత ఫ్రంట్ ఇండియాలో కేంద్రం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం లేదు. ఒక వేళ చేసినా అది ఎక్కువ కాలం నిలబడదు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఈ విషయం అర్థం చేసుకున్నాడు కాబట్టే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఏడాది మునుపే కాంగ్రెస్ ను కలుపుకుని పోయాడు.
కొసమెరుపు - ఒకవేళ మే 23 ను రిజల్టులో చంద్రబాబు కంటే కేసీఆర్ కు నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినా కూడా ఇప్పటికే ఏర్పడిన ఫ్రంట్ చంద్రబాబును వదులుకోదు. ఉండవల్లి మొన్న చెప్పింది కూడా ఇదే.