బీజేపీ మాస్ట‌ర్ స్ట్రోక్‌ : సార్ కి దిమ్మతిరిగింది

July 04, 2020

దెబ్బ‌కు దేవుడైనా దిగోస్తాడ‌ని ఓ సామెత ఉంది.. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బీజేపీ దెబ్బ‌కు దిమ్మ‌తిరిగింది.. తాను మునిగింది గంగ‌.. తాను చెప్పిందే వేదం అనే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇప్పుడు బీజేపీ ఇస్తున్న స్ట్రోక్‌కు మైండ్ సెట్ అయిన‌ట్లుంది. ఐదేళ్లు అధికారంలో ఉండి నాటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని త‌క్కువ చేసి చూసిన కేసీఆర్ ఇప్పుడు బీజేపీ దూకుడుకు త‌లొగ్గి సాయుధ పోరాటాన్ని గుర్తిస్తామ‌ని, తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్నిఅధికారికంగా జ‌రుపుతామ‌ని ప్ర‌క‌టించి తెలంగాణ వాదుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

అస‌లు తెలంగాణ సాయుధ పోరాటంను కేసీఆర్ ఎందుకు త‌క్కువ చేశాడంటే కొంద‌రు విశ్లేష‌కులు ఓ గొప్ప ర‌హాస్యం చెప్పారు. కేసీఆర్ ఆలోచ‌నంతా తాను చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా, భ‌విష్య‌త్ త‌రాలు మొత్తం త‌న గురించి, త‌న పాల‌న గురించే చెప్పుకోవాలి, చ‌దువుకోవాలి, త‌లుచుకోవాలి అనే ఆలోచ‌న‌ల‌తో ముందుకు సాగుతున్నాడ‌ట‌. అందులో భాగంగా తెలంగాణ స్వ‌రాష్ట్రం కోసం చేసిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం ముందు దిగ‌దుడుపే.

అయితే తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెలంగాణ రాష్ట్రం రాగానే అస‌లు ప‌ట్టించుకోలేదు. త‌ద్వార తెలంగాణ సాయుధ పోరాటం కాల‌గ‌ర్భంలో క‌ల‌సిపోయి తెలంగాణ స్వ‌రాష్ట్ర పోరాట‌మే చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని భ్ర‌మించారు. అందుకే తెలంగాణ విమోచ‌న దినోత్స‌వంగా సెప్టెంబ‌ర్ 17న జ‌ర‌పాల‌ని అన్ని పార్టీలు డిమాండ్ చేసినా ఏనాడు ప‌ట్టించుకోలేదు. స‌రిక‌దా తాను అస‌లు అలాంటి దినోత్స‌వం లేద‌న్న‌ట్లే వ్య‌వ‌హ‌రించేవారు.

అయితే ప్ర‌తిఏటా క‌మ్యూనిస్టులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవ‌రికి తోచిన విధంగా వారు తెలంగాణ అమ‌ర‌వీరుల‌కు నివాళి అర్పించేవారు. అయితే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం జ‌ర‌ప‌లేదు. దీనికి మ‌రో కార‌ణంగా ఎంఐఎం చేతిలో కీలుబొమ్మ‌గా మారిన కేసీఆర్ విమోచ‌న దినోత్స‌వంను జ‌ర‌ప‌డానికి జంకేవార‌నే అప‌వాదు లేక‌పోలేదు. అయితే ఇప్పుడు బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి రావ‌డం, తెలంగాణ‌కు చెందిన కిష‌న్‌రెడ్డి కేంద్ర హోం మంత్రిగా నియ‌మితులు కావ‌డం, టీ ఆర్ఎస్‌కు చెందిన వారు బీజేపీ తీర్థం పుచ్చుకుంటుండంతో తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి.

ఈ క్ర‌మంలోనే బీజేపీ తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం జ‌రిపితే త‌న అస్థిత్వం ఎక్క‌డ పోతుంద‌నే భ‌యం కేసీఆర్‌కు ప‌ట్టుకుందట‌. అందుకే తెలంగాణ విమోచ‌న దినోత్స‌వంను జ‌రుపుతామ‌ని అసెంబ్లీ సాక్షిగా చెప్ప‌డం ఇప్పుడు తెలంగాణ వాదుల‌ను విస్మ‌యానికి గురిచేస్తుంది. సో కేసీఆర్‌కు బీజేపీ ఇస్తున్న‌మాస్ట‌ర్ స్ట్రోక్‌కు దిమ్మ‌తిరిగి బొమ్మ క‌నిపిస్తుంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.