భూకంపం పుట్టిస్తాన‌న్నావు...చ‌ప్పుడు లేదేంటి కేసీఆర్‌?

July 07, 2020

`కేంద్రం రాష్ట్రాల హ‌క్కుల‌ను హ‌రిస్తోంది. ప్ర‌జ‌లు కోరిక‌కు భిన్నంగా న‌డుచుకుంటోంది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో...రాష్ట్రాల ప్ర‌యోజ‌నాల కోసం గ‌ళ‌మెత్తడం నా ల‌క్ష్యం. క‌లిసి వ‌చ్చే భాగ‌స్వామ్య‌పార్టీల‌తో సాగుతూ ఢిల్లీ నిర్ణ‌యాల‌ను ప్ర‌భావితం చేస్తాను. ఢిల్లీలో రాజ‌కీయాలు చేయాలంటే...అక్క‌డికే వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఇక్క‌డే (హైద‌రాబాద్‌)లోనే ఉంటా...భూకంపం పుట్టిస్తా`` ఈ మాట‌లు ఎవ‌రివో కాదు...తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌వి. తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌తో పాటుగా...ఇత‌ర రాష్ట్రాల కోసం నిన‌దించ‌డం అనే ఎజెండాను ఎత్తుకున్న‌పుడు...ఆయ‌న చేసిన కామెంట్లు. అయితే, ఇప్పుడు అదే కేంద్ర‌ప్ర‌భుత్వం కేసీఆర్ నాయ‌క‌త్వంలోని తెలంగాణ‌కు తీవ్రంగా మొండిచేయి చూపినా....భూకంపం సంగ‌తి దేవుడెరుగు...క‌నీస స్పంద‌న కూడా కేసీఆర్ వైపు నుంచి రావ‌డం లేదంటున్నారు!

తాజా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ‌కు మొండి చేయి చూపారు. గతంలో మాదిరిగానే ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లోనూ వాటికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఆఖ‌రికి రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీలకూ దిక్కు లేకుండా పోవటం గమనార్హం. ఆ చట్టంలో తెలంగాణలో గిరిజన యూనివర్శిటీ, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, స్టీల్‌ ప్లాంటు, రైల్వే లైన్ల వంటి వాటిని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారు. ఇదే సమయంలో జీఎస్డీపీ పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నదంటూ సీఎం కేసీఆర్‌ పలుమార్లు చెప్పారు. అయినప్పటికీ కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి ప్రాధాన్యాన్నీ ఇవ్వలేదు. టీఆర్ఎస్‌ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్న మిషన్‌ భగీరధ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ.25 వేల కోట్ల సాయం చేయాలంటూ నీతి అయోగ్‌ గతంలో సిఫారసు చేసింది. ఆ సిఫారసులను ఈసారి కూడా కేంద్రం తుంగలో తొక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గానీ, పాలమూరు - రంగారెడ్డికిగానీ ఎలాంటి ప్రాధాన్యతనివ్వకపోవటం గమనార్హం. వాటికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ మోడీ సర్కారు పట్టించుకోలేదు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే త‌మ‌కు అత్యంత ప్రాధాన్య‌మైన అంశ‌మ‌ని ప్ర‌క‌టించుకుంటున్న గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్పుడు ఆ ప్ర‌యోజ‌నాల‌కు తీవ్రంగా భంగ క‌లిగిన త‌రుణంలో...ఏ విధంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దేశంలోని ఆయా రాష్ట్రాల ప్ర‌యోజ‌నాల కోసం గ‌లం విప్పుతాన‌ని ప్ర‌క‌టించిన ఈ ఉద్య‌మ నాయ‌కుడు...త‌న సొంత రాష్ట్రానికి జ‌రిగిన తీవ్ర అన్యాయం గురించి...ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.