ఇంట్లో నుంచి రోడ్డు మీదకు వస్తే కేసీఆర్ పన్నులేస్తారా?

February 23, 2020

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎంతమంది ఉన్నా ఫైర్ బ్రాండ్ రాములమ్మ తీరు మాత్రం భిన్నంగా ఉంటుంది. వేదికల మీద పెద్దగా కనిపించటం అలవాటులేని ఆమె.. పార్టీ కార్యక్రమాల్లోనూ పాలుపంచుకోరు. కానీ.. సోషల్ మీడియాను ఎంతలా వాడేయాలో ఆమెకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెప్పాలి. లెక్క పెట్టినట్లు.. తూకం తూచినట్లుగా వారానికి.. పది రోజులకు.. కొన్ని సందర్భాల్లో ఒకట్రెండు రోజుల తేడాతో వరుస పెట్టి పోస్టులు పెట్టటం.. సూటిగా కేసీఆర్ సారును టార్గెట్ చేయటం ఆమెకు అలవాటు.

ప్రజల మధ్య తిరగకున్నా.. ఇష్యూల మీద ఎప్పటికప్పుడు అప్డేట్ విషయంలో విజయశాంతిని వంక పెట్టలేం. త్వరలో కరెంటు ఛార్జీల్ని పెంచనున్నారన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. ఇలాంటివేళ.. అందరి చూపు తన మీద పడేలా విజయశాంతి వ్యాఖ్యలు ఉన్నాయి.
మొన్న ఆర్టీసీ ఛార్జీలు.. ఇటీవల పాల ధరలు పెంచిన ప్రభుత్వం త్వరలో కరెంట్ ఛార్జీలను పెంచేందుకు వీలుగా రంగం సిద్ధం చేస్తున్నట్లు మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో ఇంతకాలం గారడీ చేసిన కేసీఆర్ అసలు రంగు ఇప్పుడు బయటపడుతుందన్నారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన దుబారా ఖర్చులతో ఇప్పుడు సామాన్యుడి నడ్డి విరిచి.. వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడపలేని దుస్థితిలో సీఎం దొరవారు ఉన్నారన్న ఆయన.. రాబోయే రోజుల్లో ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టి రోడ్డు మీదకు వచ్చినా పన్ను వేసే రోజు వస్తుందని విరుచుకుపడ్డారు. దుబారా ఖర్చులు చేస్తూ.. ఇష్టానుసారం అప్పులు చేసి.. ఆ భారం సామాన్యుడి మీద పడుతుందని హెచ్చరిస్తే.. విపక్షాల మీద కేసులు పెడతానని కేసీఆర్ బెదిరించారని.. మరిప్పుడు ఏం చెబుతారన్నారు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కు తగ్గట్లే రాములమ్మ ఆగ్రహ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు.