రాజ్ భవన్ యాక్టివిటీస్ కేసీఆర్ కు మింగుడుపడటం లేదట!

August 14, 2020

అయితే ప్రగతి భవన్.. లేదంటే ఫామ్ హౌంలో కనిపించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే బయట కనిపిస్తుంటారు. అధికార పక్ష అధినేతగా ఉన్నవారెవరైనా సరే.. నిత్యం నిమిషం ఖాళీ లేకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనటం చూస్తుంటాం.

అందుకు భిన్నంగా కొన్ని రోజులు రాక్షసుడిని తలపించేలా సుదీర్ఘ రివ్యూలు.. వరుస మీటింగ్ లు పెట్టే కేసీఆర్.. కొద్ది రోజుల పాటు అస్సలు కనిపించరు. ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారన్న విషయాల్ని తెలుసుకోవటం చాలా కష్టం.

ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై. మొన్నటికి మొన్న నిమ్స్ కు వెళ్లిన ఆమె.. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ ను అభినందించటానికి.. పాజిటివ్ వచ్చిన వారిలో ఆత్మస్థైర్యం పెంచేందుకు తాను వచ్చినట్లుగా పేర్కొన్నారు.

ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో గవర్నర్ స్థాయికి చెందిన వారు నిమ్స్ లాంటి ఆసుపత్రికి రావటం చిన్న విషయమేమీ కాదు. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా ఆమె వీడియోకాన్ఫరెన్సును నిర్వహించారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ఆమె భేటీ కావటం విశేషం.

సీసీఎంబీ సంచాలకులు రాకేశ్ మిశ్రా.. కేంద్ర ఆరోగ్య శాఖా మాజీ కార్యదర్శి సుజాతారావు.. మాజీ డీజీపీ హెచ్ జే దొర.. అపోలో ఆసుపత్రి ప్రెసిడెంట్ హరిప్రసాద్ లతో పాటు ఐఎంఏ తెలంగాణ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి.. కొవిడ్చికిత్స నిపుణులు స్వామినాథన్.. కొవిడ్ బారిన పడి ప్లాస్మా చికిత్స పొందిన వంశీ మోహన్ లతో మాట్లాడారు.

ఈ సందర్భంగా పలు సలహాలు.. సూచనలు చేసిన తీరు చూస్తే.. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యల విషయంలో సీఎం కేసీఆర్ ఎక్కడ వెనకబడి ఉన్నారన్నది తమిళసై తన చేతలతో చెప్పేశారని చెప్పాలి.

మహమ్మారికి చికిత్సను పెంచే ఆసుపత్రుల సంఖ్య పెంచాలన్న సూచన కూడా ఈ రివ్యూలో చర్చకు వచ్చింది. భౌతికదూరం.. వ్యక్తిగత పరిశుభ్రత.. మాస్కుల్ని ధరించటం లాంటి విషయాల్లో ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

యోగాను ప్రోత్సహించటంతో పాటు.. ప్రజలు రోగనిరోధకశక్తిని పెంచే మందుల్ని వినియోగించాలని కోరటం చూస్తే.. తాను చేయాల్సిన పనులు గవర్నర్ చేయటం సీఎం కేసీఆర్ కు అంతగా మింగుడుపడని వ్యవహారంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.