శుక్రవారం 75 కేసులు... కేసీఆర్ సంచలన నిర్ణయం !!

June 03, 2020

ఈరోజు తెలంగాణలో నమోదైన కేసులు అతిపెద్ద రికార్డు. ఇంతవరకు ఏరోజు అన్ని కేసులు నమోదు కాలేదు. ఒక్క రోజే తెలంగాణలో 75 కేసులు బయటపడటం వెనుక అందరూ ఆశ్చర్యపోయారు. వామ్మో ఇంకెంత పెరుగుతాయో అని భయపడుతున్నారు. అయితే.. ఈ స్థాయిలో కేసులు పెరగడానికి సరైన కారణమే ఉంది. ఇప్పటివరకు మొత్తం కేసులు డిశ్చార్జి అయిన వాటితో కలిపి 229. అందులో 75 కేసులు ఈరోజువే. దీని వెనుక కథ ఏంటంటే... మర్కజ్ మసీదులో జరిగిన తబ్లిగి జమాత్ కి హాజరైన వారి విషయంలో తెలంగాణ సర్కారు పెద్ద ఆపరేషనే చేస్తోంది. యుద్ధ ప్రాతిపదికన వారందరినీ పట్టుకోవడమే కాదు. తెలంగాణలో అందుబాటులో ఉన్న ల్యాబ్స్ లో అందరికీ శరవేగంగా మూడు షిప్టుల్లో పరీక్షలు నిర్వహిస్తోంది. అంటే తెలంగాణలో ఇంతవరకు చేసిన పరీక్షలు ఒకెత్తు... నిన్నటి నుంచి చేస్తున్న పరీక్షలు ఒకెత్తు. 

నిరంతరాయంగా అత్యధిక మందికి పరీక్షలు చేయడం వల్ల ఈరోజు ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈరోజు 15 మంది కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారు. ఇది పెద్ద నెంబరు కిందే లెక్క. తెలంగాణలో మొత్తం ఇప్ప‌టిదాకా 32 మంది కోలుకున్నారు. ఇంకా 186 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇపుడున్న వారిలో అత్యధికులు అంటే 80 శాతం లాక్ డౌన్ పూర్తయ్యేలోపు కోలుకునే అవకాశాలున్నాయి. ప్రభుత్వం చెప్పిన దానిని బట్టి చూస్తే రేపు కూడా తెలంగాణలో పెద్ద సంఖ్యలోనే కేసులు బయటపడనున్నాయి. 

కొత్త కేసుల్లో దాదాపుగా అన్నీ ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల్లోనివే. మృతులు కూడా వారే. వీరి విషయంలో  కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ లో దీనికి చరమగీతం పాడాలని తెలంగాణ సర్కారు పట్టుదలతో ఉంది. ఎందుకంటే... ఇది రాష్ట్ర సర్కారుకు సవాలుగా మారిన విషయం. మర్కజ్ మీటింగ్ కేసులు కేసీఆర్ ను బాగా హర్ట్ చేశాయి. ఏడో తేదీ తో సంబరాలు చేసుకుందాం అనుకున్నది తలకిందులు కావడంతో దీనిని కేసీఆర్ సవాల్ గా తీసుకున్నారు.