కేసీఆర్‌తో ఇక ఢీ అంటే ఢీ

February 24, 2020

రాజకీయాల్లో అవమానాలు, నిర్లక్ష్యాల నుంచి ఉద్భవించిన పగ, పోటీ కొన్ని సందర్భాల్లో హత్యలు, దాడులు, నేరాలకు దారి తీస్తే మరికొన్ని సందర్భాల్లో నాయకుల రాజకీయ ఎదుగులకు, రాజకీయ పతనానికి, రాజకీయాల్లో భారీ మార్పులకు కూడా నాంది పలుకుతాయి. తెలుగు నాట రాజకీయాల్లో ఇలాంటివి ఇప్పటికే చూశాం. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ ఎదుగుదలకూ ఇలాంటి నేపథ్యమే ఉంది.. ఆనాడు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తెలంగాణ సెంటిమెంటును మరోసారి అస్త్రంగా వాడుకుని పార్టీ పెట్టి కసితో ఎదిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంతో పాటు సీఎం అయ్యారు కేసీఆర్. ఇక్కడ రాజకీయ మలుపులు, నాయకుల విజయాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో అలాంటి పరిస్థితే మళ్లీ కనిపిస్తోంది. ఆ పరిస్థితులను బీజేపీ చక్కగా ఉపయోగించుకుంటోంది. అయితే.. ఇది ఎంతవరకు ఫలితమిస్తుందన్నది చూడాలి.
పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌ బీజేపీలో చేరడం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మలుపనే చెప్పాలి. వివేక్ కాంగ్రెస్ దిగ్గజ నేత దివంగత వెంకటస్వామి కుమారుడు. దళిత నేత, ఉన్నత విద్యావంతుడు, ఆర్థికంగా బలవంతుడు, మీడియా సంస్థలు ఉన్న వ్యక్తి. తెలంగాణ ఏర్పాటుతో ఆయన కాంగ్రెస్ నుంచి టీఆరెస్‌లోకి వచ్చారు. కేసీఆర్ కూడా ఆయనకు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తరువాతే ఎంపీ టికెట్ ఇవ్వకుండా పక్కనపెట్టారు. పార్టీలో ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గించేశారు. ఈ పరిణామాలు వివేక్‌ను వేదనకు గురిచేశాయి. అలాంటి నిర్లక్ష్యం, నిరాదరణ ఆయన తన జీవితంలోనే ఎన్నడూ ఎదుర్కోలేదు. దాంతో విలువ లేని చోట ఉండరాదనే ఉద్దేశంతో బయటకు వచ్చేశారు. బీజేపీ ఈ పరిణామాన్ని చక్కగా వాడుకుంది. కేసీఆర్‌ చేతిలో అవమానాలకు గురై ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వివేక్‌ను పార్టీలో చేర్చుకుంది. ఇది కేసీఆర్‌కు బీజేపీ పంపిన సంకేతమని స్పష్టమవుతోంది.
మరోవైపు వివేక్ కూడా తన ప్రతీకారాన్ని బీజేపీ అండతో తీర్చుకునే అవకాశం కోసం చూస్తున్నారు. కేసీఆర్‌ను ఎలాగైనా గద్దె దించి ఆయన అహంకారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో వివేక్ ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ.. తనను అవమానించిన కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బతీయాలని కోరుకుంటున్న వివేక్ తమ లక్ష్యాలు ఎంతవరకు నెరవేర్చుకుంటారో చూడాలి.