కేంద్రంతో ఢీ అనేందుకు కేసీఆర్ రెడీ అయ్యారుగా..!

February 26, 2020

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు ఎవ‌రూ ఉండ‌రు. నిన్న‌టి మిత్రుడు రేపు శ‌త్రువు కావొచ్చు. అచ్చు ఇలాంటి రాజ‌కీయాలే తెలంగాణలోనూ క‌నిపిస్తున్నాయి. సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఊహించ‌ని విధంగా రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవ‌డం, టీఆర్ఎస్ ను ఎలాగైనా అణ‌గ‌దొక్కి చేసి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం, ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏకంగా నాలుగు స్థానాల్లో బీజేపీ గెలుపు గుర్రం ఎక్క‌డం, కాళేశ్వ‌రం వంటి బ‌హుళార్థ సాధ‌క ప్రాజెక్టుకు ప‌దే ప‌దే  కోరినా.. క‌నీసం ఒక్క రూపాయి కూడా విదిలించ‌క పోవ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో కేసీఆర్ బీజేపీపై పోరు బాటే క‌రెక్ట్ అని డిసైడ్ అయిన‌ట్టే క‌నిపిస్తోంది.
ఈ క్ర‌మంలోనే ఆయ‌న గ‌తానికి భిన్నంగా ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన ప‌న్నుల‌వాటాను ముక్కు పిండైనా వ‌సూలు చేయాల్సిందే. అని ఆయ‌న త‌ర‌చుగా అధికారుల‌కు, త‌న పార్టీ ఎంపీల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో త‌న‌కు కానీ, త‌న రాష్ట్రానికి కానీ పెద్ద‌గా స‌మ‌స్య‌కాని ఎన్ ఆర్ సీ బిల్లు విష‌యంలోనూ బీజేపీకి వ్య‌తిరేకంగా లోక్‌స‌భ‌లో త‌న పార్టీ ఎంపీల‌తో ఓటేయించారు. దీంతో బీజేపీతో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌కు కేసీఆర్ చేరిపోయార‌ని అంటున్నారు.
వాస్త‌వానికి 2014 లో టీఆర్  ఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ఆయ‌న కేంద్రానికి చాలా అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. పైకి.. చెప్ప‌క‌పోయినా.. కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వాన్ని ఆయ‌న ప‌లుమార్లు ప‌రోక్షంగా మెచ్చుకున్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యంలో దేశం మొత్తం ఆందోళ‌న‌లు వ‌చ్చినా.. తాను మాత్రం సైలెంట్ అయిపోయా రు. అలాంటి కేసీఆర్ అనూహ్యంగా బీజేపీతో ఢీకొనే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేయ‌డం రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌కు దారితీస్తోంది.దీనికి ప్ర‌ధాన కార‌ణం.. రాష్ట్రంలో పార్టీ పుంజుకోవ‌డ‌మే న‌ని బీజేపీ వ‌ర్గాల నుంచి కూడా క‌థ‌నాలు వ‌స్తున్నాయి.
కేసీఆర్ ఏ ప‌ని చేసినా.. త‌ప్పులు వెత‌క‌డం, కేంద్రం నుంచి నాయ‌కులు వాలిపోయి.. విమ‌ర్శ‌లు చేయ‌డం కూడా కేసీఆర్ ఆగ్ర‌హానికి కార‌ణంగా చెబుతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే ఇటీవ‌ల ఆయ‌న ఢిల్లీ వెళ్లి పీఎం మోడీతో భేటీ అవ్వాల‌ని నిర్ణ‌యించుకుని ఆఘ‌మేఘాల‌పై ఆయ‌న హ‌స్తిన‌కు చేరుకున్నారు. అయితే, పీఎంవో మాత్రం స్పందించ‌లేదు. దీంతో ఆయ‌న కూడా వెనుదిరిగి వ‌చ్చారు. ఈ ప‌రిణామాలు మున్ముందు ఎలా దారితీస్తాయో ? చూడాలి.