కేసీఆర్‌కు జగన్ ఇచ్చిన షాక్ మామూలుగా లేదుగా..

February 25, 2020

జగన్, కేసీఆర్ దోస్తీకి దాదాపు తెరపడినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ విషయంలో జగన్ నిర్ణయాలపై కేసీఆర్‌పై కౌంటర్ వేయడం.. దానికి జగన్ నేరుగా స్పందించకపోయినా ఏపీ రవాణా మంత్రి పేర్ని నాని స్పందించి కేసీఆర్ మాటల నేపథ్యంలోనే తాము ఇంకా ముందే ప్రోసెస్ ముగించాలనుకుంటున్నామని చెప్పడం వంటివన్నీ ఇద్దరి మధ్యా చెడిందన్న సంగతిని బహిరంగపర్చాయి.. అయితే, తాజాగా ఆర్టీసీ కంటే మరో పెద్ద విషయంలో రెండు రాష్ట్రాల మధ్య రగడ మొదలు కానుంది. అది కాళేశ్వరం ప్రాజెక్టు. అవును కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ వెళ్లారు కూడా. కానీ.. ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జగన్ నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు భారీ షాకిచ్చింది.
తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని, దీనికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించే అంశాన్ని పరిశీలించవద్దని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విభజన హామీల అమలులో జాప్యం జరుగుతోందంటూ సుప్రీంకోర్టులో పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వం అఫిడ్‌విట్ దాఖలు చేసింది. దీనికి కౌంటర్‌గా ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడ్‌విట్‌లో ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలోని ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపేయడంతో అభ్యంతరాలు చెప్పే హక్కు లేదని స్పష్టం చేసింది. పోలవరానికి సంబంధించిన కేసులో తెలంగాణను పార్టీగా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అఫిడవిట్‌లోని అంశాలను పరిశీలించి విభజన చట్టంలో పేర్కొన్న హామీలను తప్పకుండా త్వరగా అమలు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం విన్నవించింది. అలాగే, దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది.
విభజన చట్టంలో పేర్కొనని పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు కృష్ణా బోర్డు అనుమతులు లేవని కేంద్ర జలవనరుల శాఖ స్పష్టం చేసినా తెలంగాణ మాత్రం ఈ విషయంలో ముందుకెళ్తోందని తెలిపింది. దీనిపై మరోసారి అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేసినా కేంద్రం చర్యలు తీసుకోలేదని వివరించింది.
కృష్ణా బేసిన్‌లో 180 టీఎంసీలకు పైగా వినియోగించుకునేలా పాలమూరు రంగారెడ్డి, డిండి, గోదావరి బేసిన్‌లో 450 టీఎంసీల నీటి వినియోగం నిమిత్తం కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం తదితర ప్రాజెక్టులను తెలంగాణ చేపట్టిందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. రీఇంజినీరింగ్‌ పేరుతో కాళేశ్వరం చేపట్టినట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నా ఇది ముమ్మాటికీ కొత్త ప్రాజెక్టేనని... దీని వల్ల పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీలపై తీవ్ర ప్రభావం పడుతుందని..  ఏపీ ప్రాజెక్టుల పరిధిలోని రైతులను విస్మరించి పక్షపాతంతో కాళేశ్వరం పనులు కొనసాగిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించొద్దని ఏపీ ప్రభుత్వం కోరింది.