మా తెలంగాణ చంద్రుడి నిద్ర మ‌త్తు వ‌దిలించు కేజ్రీవాల్

July 05, 2020

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న కొద్దీ ప్ర‌జ‌ల‌కు ఏదో చేయాల‌న్న ఆలోచ‌న అంత‌కంత‌కూ పెరిగిపోతూ ఉంటుంది. మిగిలిన రోజుల్లో కంటే.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ ప్ర‌జ‌ల మ‌న‌సులు దోచుకునే కొత్త ఆలోచ‌న‌ల దిశ‌గా పరుగులు తీస్తుంటారు. తాజాగా అలాంటి ప‌ని మీద‌నే క‌స‌ర‌త్తు చేస్తోంది ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ స‌ర్కార్‌.
త్వ‌ర‌లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ మ‌హిళ‌ల‌కు తీపి క‌బురు అందించాల‌న్న ఆలోచ‌న‌లో కేజ్రీవాల్ ప్ర‌భుత్వం ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఢిల్లీ మ‌హాన‌గ‌రికి చెందిన మ‌హిళ‌ల‌కు మెట్రో రైలు.. బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణానికి వీలుగా నిర్ణ‌యం తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఢిల్లీ రాష్ట్ర ర‌వాణా మంత్రి కైలాష్ అధికారుల‌తో చ‌ర్చ‌లు షురూ చేశారు. మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల్ని తాము ప‌రిశీలిస్తామ‌ని ఆయ‌న చెబుతున్నారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న వేళ‌.. ఈ త‌ర‌హా నిర్ణ‌యానికి అవ‌కాశం ఉందంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ మెట్రోపై త‌మ‌కు పూర్తి అధికారం వ‌స్తే ఛార్జీల‌ను 25 నుంచి 30 శాతం వ‌ర‌కు త‌గ్గిస్తామ‌ని ఒక‌వైపు.. మ‌రోవైపు ఉచిత ప్ర‌యాణం గురించి వ‌స్తున్న వార్త‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. కేజ్రీవాల్ స‌ర్కారు కానీ ఈ త‌ర‌హా నిర్ణ‌యం తీసుకుంటే.. దాని ప్ర‌భావం మిగిలిన రాష్ట్రాల మీద త‌ప్ప‌క ఉంటుంది. అదే జ‌రిగితే.. ఏపీ బ‌స్సు ఛార్జీల‌తో పోటీ ప‌డే హైద‌రాబాద్ మెట్రో రైలు ఛార్జీల మీద ప్ర‌భావం ప‌డ‌క మాన‌దు. అప్ప‌టికైనా తెలంగాణ చంద్రుడు హుషారుకు వ‌చ్చి.. హైద‌రాబాద్ న‌గ‌ర‌జీవుల‌కు మేలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది.