జగన్ ఇలాగే తలూపితే... 2024 ఏపీ సీఎం కేసీఆరే

May 26, 2020

‘రాయలసీమను రతనాల సీమను చేస్తాను...’
‘గోదావరి నీళ్లు వృథా కానివ్వకుండా దిగువన ఆంధ్రప్రదేశ్‌కు వదిలి ఆదుకుంటాం’

‘ఏపీ ప్రజలకు నా ఆశీస్సులున్నాయి.. ’ 

ఈ మాటలన్నీ చెబుతున్నది ఏ బాబానో కాదు, ప్రధాని కూడా కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా కాదు. పొరుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్. కర్మ గాక పోతే... ఏపీని ఆశీర్వదించడానికి ఈయన దేవుడా? ఎంత తల పొగరు మాటలివి? 

ఆంధ్రోళ్లను తరిమితరిమి కొడతానంటూ 14 సంవత్సరాలు బుసలు కొట్టిన కేసీఆర్. రాష్ట్రాన్ని తెలంగాణ, ఏపీలుగా విభజించి హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కేంద్రం నిర్ణయించినా పొగబెట్టి పంపించిన కేసీఆర్. ఇప్పుడు అదే కేసీఆర్ ఏపీ పాలిట దేవుడి అవతారమెత్తుతానంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ తానే ముఖ్యమంత్రిలా హామీలు గుప్పిస్తున్నారు. నెలకు రెండు సార్లు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్తూ అక్కడి కీలక నాయకులతో భేటీ అవుతున్నారట కేసీఆర్. అంతేకాదు.. మీ పొలాలకు పారే నీరు, మీరు తాగే నీరు అంతా నా దయే అంటున్నారు. మీ భవిష్యత్ నా చేతిలో ఉందని చెబుతున్నారు.
కేసీఆర్ తానే ఏపీ ముఖ్యమంత్రిని అన్నట్లుగా వ్యవహరిస్తున్నా ఏపీ అసలు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మాత్రం దండాలు పెడుతూ, అమాయకపు నవ్వులు నవ్వుతూ సోఫాలో ఒక మూలన కాళ్లు రెండూ ఒద్దికగా పెట్టుకుని రెండు అరచేతులనూ ఒకదానితో ఒకటి రుద్దుకుంటూ సిగ్గుతో మెలికలు తిరుగుతూ చోద్యం చూస్తున్నారు.
కేసీఆర్ మాయలో జగన్ పడ్డారని.. కేసీఆర్ రాజకీయాన్ని జగన్ అర్థం చేసుకోలేకపోతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. స్నేహం, రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య అంటూ కేసీఆర్ ఏపీలో మెల్లమెల్లగా అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తూ జగన్‌కి నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
కేసీఆర్‌కు ఆంధ్రప్రాంతాన్నీ పాలించాలన్న కోరిక ఉందని.. రెండు రాష్ట్రాలకూ ముఖ్యమంత్రిగా పనిచేశానన్న సంతృప్తి, రికార్డు ఆయన కోరుకుంటున్నారని ఒక ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలోనే ఏపీ ప్రజల్లో తనపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవడంతో పాటు ఏదో రకంగా ఒక్క రోజైనా ఏపీ సీఎంగా పనిచేయాలని కేసీఆర్ కలలు కంటున్నారన్న ప్రచారం ఒకటి సోషల్ మీడియాలో సాగుతోంది. అందుకు ఆయన ఇప్పటినుంచే పునాదులేసుకుంటున్నారని వినిపిస్తోంది.
ఊహాగానమే అయినప్పటికీ ఈ ప్రచారమే కనుక నిజమైతే 2024 ఎన్నికలలో జగన్‌కు టీడీపీ, బీజేపీ, జనసేన కాకుండా టీఆరెస్ పోటీ అయినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.