నిజాంలు, చంద్రబాబులు గుర్తుకురాకూడదట

July 11, 2020

అరే.. గ‌డువు తీర‌క ముందే ప్ర‌జాతీర్పుకు వెళ్లిన ధీశాలికి తెలంగాణ ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టిన త‌ర్వాత‌.. ముచ్చ‌ట ప‌డి రెండు భారీ బిల్డింగులు క‌ట్టాల‌ని డిసైడ్ అయితే.. ఆ మాత్రం దానికే ఆగ‌మాగం అయితే కోపం రాదా ఏంటి? అయినా.. మ‌న‌సున్న మారాజు ఏం కోరుకున్నారు? మ‌ణులు ఇవ్వ‌మ‌న్నారా? మాణిక్యాలు ఇవ్వ‌మ‌న్నారా? త‌న ప్రాణాన్ని ప‌ణంగా పెట్టి తెలంగాణ తీసుకొచ్చిన పెద్ద మ‌నిషి కొత్త స‌చివాల‌యాన్ని.. కొత్త అసెంబ్లీ భ‌వ‌నాన్ని క‌ట్టి.. చరిత్ర‌లో అలా నిలిచిపోవాల‌ని భావిస్తే.. ఆ మాత్రం దానికే అంద‌రూ అలా క్వ‌శ్చ‌న్లు వేస్తే సారు వారికి ఎంత కోపం వ‌స్తుంది?
అయినా.. ఆయ‌నేమ‌న్నా ఆయ‌న ఇంటి కోసం స‌చివాల‌యాన్ని నిర్మిస్తున్నారా? తెలంగాణ ప్ర‌జ‌ల కోసం.. భావి త‌రాల కోసం ఇప్పుడున్న పాత ముస‌లి డొక్కు లాంటి (కేసీఆర్ భావ‌న‌లో సుమి) స‌చివాల‌యాన్ని కూల‌గొట్టేసి భారీ భ‌వ‌నాన్ని క‌ట్టేస్తే ఆ సోకు ఎలా ఉంటుంది? ఆలోచించండి.
294 మందికి ముచ్చ‌ట‌గా స‌రిపోయే అసెంబ్లీ భ‌వ‌నం 119 మందికి ఎలా స‌రిపోతుంది? ఏడాదిలో మ‌హా అయితే మూడునాలుగు సార్లు.. ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో మ‌రోసారి స‌మావేశ‌మ‌య్యే భ‌వ‌నం బాగుండాల‌ని ఆశ ప‌డ‌టం అత్యాశ ఎందుక‌వుతుంది? తెలంగాణ లాంటి ధ‌నిక రాష్ట్రంలో అసెంబ్లీ భ‌వ‌నం అంటే ఎలా ఉండాలి? స‌ద‌రు భ‌వ‌నాన్ని చూసినంత‌నే తెలంగాణ ప్ర‌జ‌ల క‌డుపు నిండిపోవాలి. అంతేనా.. బ‌య‌ట నుంచి వ‌చ్చినోళ్లు స‌ద‌రు బిల్డింగ్ ను చూస్తే అసూయ‌తో ఉడికిపోవాలి.
అలాంటి క‌ట్ట‌టం అప్పుడెప్పుడో క‌ట్టించి దాన్లో స‌ర్దుకోమ‌న‌టం సాధ్య‌మా? ఏళ్ల‌కు ఏళ్లు రోడ్ల మీద ఉద్య‌మాలు చేసి.. ఎన్నో అవ‌మానాలు ప‌డి.. ఎట్ట‌కేల‌కు తెలంగాణ సాధించిన త‌ర్వాత కాస్తంత భారీ భ‌వ‌నాన్ని నిర్మించాల‌నుకోవ‌టాన్ని త‌ప్పు ప‌ట్ట‌టం ఏమిటి? హైద‌రాబాద్ లోని కీల‌క‌మైన అన్ని భ‌వ‌నాలు అప్పుడెప్పుడో నిజాం క‌ట్టించిన వాటిల్లో ఇప్ప‌టికి ఉండిపోవ‌టం ఏమిటి? నిజాం హ‌యాం గురించి కేసీఆర్ జ‌మానాలో చెప్పుకోవ‌టం ఏమిటి? ఇదే తీరును కొన‌సాగిస్తే.. భ‌విష్య‌త్తులోనూ నిజామే త‌ప్పించి కేసీఆర్ క‌నిపించ‌రు. అందుకే కాబోలు ప్రాణాల్ని ప‌ణంగా పెట్టి తెచ్చిన తెలంగాణ‌లో త‌న మార్క్ క‌నిపించాల‌ని ఆశ ప‌డ‌టం అత్యాశ ఎందుక‌వుతుంది చెప్పండి. ప్ర‌తి విష‌యంలోనూ లోపాలే త‌ప్పించి.. సానుకూల‌త‌లు క‌నిపించ‌వా? నోరు ఉంది క‌దా అని సారువారిని అలా ఆడిపోసుకోవ‌టం ధ‌ర్మ‌మేనా?