కేసీఆర్.. అవినీతికి చెక్ పెడుతున్నారా?

December 08, 2019

కేసీఆర్ తీరే వేరు.. ఆయన పాలనా విధానమే ప్రత్యేకం. సచివాలయంలో అడుగు పెట్టకుండానే ఆయన వేసే స్కెచ్చులు ఎవ్వరూ ఊహించలేరు. అయితే చెప్పినవన్నీ చేస్తాడా? అనే నమ్మకం కూడా ఆయన మీద అందరికీ లేదు లెండి.. అది వేరే విషయం! తాను రెవెన్యూ శాఖలో పలు మార్పులు తీసుకురాబోతున్నట్టు సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చిన గులాబీ పెద్ద అన్నంత పని చేయడానికి పూనుకున్నారు. ఈ మేరకు పార్టీ సమావేశం ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించారు కేసీఆర్.

తెలంగాణ రాష్ట్రంలో దశను మార్చే కొత్త చట్టానికి కేసీఆర్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి జరిగే ఛాన్స్ ఉండకూడదని, ప్రజలందరికీ అవినీతి రహిత పాలనను అందించడానికి గొప్ప సంస్కరణకు పూనుకున్నారు కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం క్రింద పని చేస్తున్న అన్ని విభాగాలు, సంస్థలను మరింత పారదర్శకంగా రూపొందించడానికి భారీ ముందడుగు వేశారు గులాబీ బాస్. లోక్ సభ ఎన్నికలు ముగియడంతో.. ఇప్పుడు తన అమ్ముల పొదిలోని భారీ అస్త్రాన్ని బయటకు తీశారాయన. ప్రస్తుతం పాలనలో పుట్టాలన్నా లంచం, చచ్చాక డెత్ సర్టిఫికెట్ కు లంచం, కులం సర్టిఫికెట్లు కావాలన్నా లంచం, మ్యూటేషన్లు - రిజిస్ట్రేషన్లు.. ఇలా ప్రభుత్వ పనులు ఏవైనా సరే.. సదరు అధికారి చేయి తడపనిదే ఒక్క పని కాని పరిస్థితి ఉంది. వీటి వలన ప్రభుత్వానికి చెడ్డపేరు, నిందలు వస్తున్నాయి. అందుకే కేసీఆర్ వీటన్నింటినికి పరిష్కారంగా కొత్త పురపాలక, రెవెన్యూ చట్టాలకు పదును పెట్టె దిశగా పనులు ప్రారంభించారు. తాజాగా ప్రగతి భవన్ లో శుక్రవారం ఉన్నతాధికారులతో పురపాలన చట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్షించడం జరిగింది. ఇప్పటికే పంచాయతీరాజ్ కొత్త చట్టాన్ని తెచ్చిన కేసీఆర్.. ఇప్పుడు పురపాలక సంస్థలను బలోపేతం చేసి వాటికి అధికారాలు, బాధ్యతలు అప్పగించేలా కొత్త చట్టం చేస్తామని ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే నూతన పురపాలక చట్టంలో విప్లవాత్మక మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారని సమాచారం. ఏ ప్రభుత్వ శాఖలో అయినా పనులు కావాలంటే ఒక్క నయాపైసా లంచం ఇవ్వకుండా పనులు పూర్తి అయ్యేలా ఆన్ లైన్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు కేసీఆర్. అలాగే నిర్ణీత గడువులోగా అధికారి పని చేయకపోతే.. సదరు అధికారికి జరిమానా పడేలా చట్టంలో రూపకల్పన చేయనున్నారు. ఇప్పుడు రెవెన్యూ చట్టాన్ని కూడా ఇదేతరహాలో మార్చేందుకు కేసీఆర్ నడుం బిగించారు. మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పురపాలన ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని ముందుకు తీసుకురావాలా? లేక ఎన్నికల తర్వాత తీసుకురావాలా అనే అంశంపై ప్రధానం సమాలోచనలు చేస్తున్నారు కేసీఆర్. తెలంగాణలో ఈ చట్టం అమలైతే మాత్రం ఇక పురపాలికల్లో అవినీతికి పూర్తి స్థాయిలో చెక్ పడటం ఖాయం. కాకపోతే కేసీఆర్ దీనికి పురపాలక సంఘ ఎలక్షన్ స్టంట్ గా తెరపైకి తెచ్చారా? లేక అన్నంత పని పూర్తిచేసి భేష్ అనిపించుకుంటారా? అని జనాల్లో చర్చలు మొదలయ్యాయి. చూద్దాం ఏం జరుగనుందో!