కేసీఆర్‌కే మ‌ద్ద‌తు..జ‌గ‌న్ పిలిస్తే ప్ర‌చారం చేస్తా

May 26, 2020
CTYPE html>
పార్ల‌మెంటు ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎంఐఎం కేంద్ర కార్యాలయం దారుసలాంలో పార్టీ 61వ పునరావిర్భావ దినోత్సవసభలో అసదుద్దీన్ ఎంపీ ఎన్నికల్లో తమ పార్టీ వ్యూహాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసేది లేదని.. టీఆర్‌ఎస్‌తో అనుబంధం కొనసాగుతుందని ఎంఐఎం అధినేత స్పష్టం చేశారు. హైదరాబాద్ నియోజకవర్గంలో తాము, మిగతా 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తామని, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబుకు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వడ్డీతో సహా రుణం చెల్లిస్తామని పునరుద్ఘాటించారు. పాకిస్థాన్ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని మసూద్ అజర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వింగ్‌కమాండర్ అభినందన్‌ను విడుదల చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. ఉగ్రవాద సంస్థలను జైషే సైతాన్, లష్కరే సైతాన్‌గా అభివర్ణించారు.
 
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్ 16 సీట్లను, తాము హైదరాబాద్ సీటును గెలుచుకుని సంపూర్ణ విజయం సాధిస్తామని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధీమా వ్యక్తంచేశారు. ఏపీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ఆహ్వానిస్తే ప్రచారం చేస్తామని స్పష్టంచేశారు. ఏపీలో జగన్ పార్టీ 20 సీట్లు గెలిస్తే అక్కడి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. తెలంగాణలో 17 సీట్లు, ఏపీలో 20 సీట్లు కలుపుకొంటే 37 సీట్లతో ఢిల్లీ రాజకీయాలను శాసించవచ్చన్నది తమ వ్యూహమని ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నోటికొచ్చినట్టు మాట్లాడారని మండిపడ్డారు. చంద్రబాబుకు తాము రుణం(కర్జా) చెల్లించాల్సి ఉన్నదని, వచ్చే ఎన్నికల్లో వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసేది లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అయోమయంలో ఉన్నదని, వచ్చే ఎన్నికల్లో ఎన్నిసీట్లు గెలుస్తామో, గెలిచినా ఏం చేయాలో? వారికే స్పష్టత లేదన్నారు. కనీసం 120 సీట్లు తెచ్చుకునే శక్తి ఉం దా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో ఉండి తెలంగాణ ప్రజలను పాలించాలనుకుంటే జరిగే పని కాదని చెప్పారు.
 
ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలపై ఎంపీ అసదుద్దీన్ మండిపడ్డారు. 2012లో తన తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు, ఆదిలాబాద్ వంటి జిల్లాలకు తిప్పినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఫోన్ ఎత్తలేదని తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తెల్లారే తనకు ఫోన్‌చేసి యోగక్షేమాలు అడిగారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 50 సీట్లు గెలుచుకుంటాం. అధికారంలోకి రావడానికి మీ మద్దతు కావాలి అని తను అభ్యర్థించారని పేర్కొన్నారు. యాభై ఎందుకు వంద సీట్లు రావా అని తాను వ్యంగ్యంగా ప్రశ్నించానన్నారు. ప్రజలంతా టీఆర్‌ఎస్ పక్షాన ఉన్నారని, ఆ పార్టీకి కనీసం 98 సీట్లకు తగ్గకుండా భారీ మెజార్టీ వస్తుందని, పగటి కలలు కనొద్దని సూచించానని చెప్పారు. తర్వాత తాను సీఎం కేసీఆర్‌తో ఆయన క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యాయని, ఆ సందర్భంగా మీడియాతో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశానన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్, ఏపీలో జగన్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.