రేణుకకు రూ. 150 కోట్లిచ్చిన కేసీఆర్.. ఇందులో నిజమెంత..?

July 20, 2019

గత డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ హవా చూపించినా.. ఖమ్మం జిల్లాలో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయింది. అక్కడి పది స్థానాల్లో కేవలం ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లోనైనా ఖమ్మం కోటపై జెండా ఎగురవేయాలని ఆ పార్టీ అధిష్ఠానం పట్టుదలతో పని చేసింది. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత నామా నాగేశ్వర్రావును పార్టీలో చేర్చుకుని అభ్యర్థిగా ప్రకటించింది. అంతేకాదు, అక్కడి గెలుపు బాధ్యతలను సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు అప్పగించారు గులాబీ బాస్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. దీంతో వారంతా కలిసి కట్టుగా పని చేసుకుపోయారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిని నిలబెట్టారు. ఈ క్రమంలో ప్రచారంతో పాటు ఖమ్మంలో పోరు రసవత్తరంగా సాగింది.

లోక్‌సభ ఎన్నికల సమరం ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు తమదే విజయమనే ధీమాతో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల సరళిని పరిశీలించిన అనంతరం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలుపు తనకే దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మెజారిటీ లభిస్తుందని ఆశిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌పార్టీకి ఏజెంట్లు లేరని, బూత్‌ల వద్ద ప్రచారం కూడా జరగలేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. నామాకు 50వేల నుంచి లక్ష వరకు ఆధిక్యత లభిస్తుందని టీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీ సైతం విజయం తమదేననే ధీమాతో ఉంది. ఆ పార్టీ అభ్యర్థి రేణుకాచౌదరి పాలేరు నుంచి అశ్వారావుపేట వరకు అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ సరళిని పరిశీలించారు. కాంగ్రెస్‌, టీడీపీ ఓటర్లతోపాటు, అన్నివర్గాల ప్రజలు తనకే ఓటువేశారని, డబ్బు ప్రభావం ఎక్కడా లేదని, కాంగ్రెస్‌కే గెలుపు అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.

ఎన్నికలకు ముందు.. ముగిసిన తర్వాత ఖమ్మంలో ఓ ప్రచారం జోరుగా సాగింది. అదే.. కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి కేసీఆర్ రూ. 150 కోట్లు ఇచ్చారని, దీంతో ఆమె చివరి రోజులు ప్రచారం కూడా సరిగా నిర్వహించలేదని టాక్ వచ్చింది. దీంతో అక్కడ నామానే విజయం సాధించబోతున్నారని అంతా అనుకుంటున్నారు. అయితే, దీనిపై ఆమె స్పందించారు. ‘‘ఖమ్మంలో జరుగుతున్న ధర్మయుద్ధంలో గెలవలేని టీఆర్‌ఎస్‌ ఓటమి భయంతో మా పార్టీపై, నాపై అసత్య ప్రచారాలు చేస్తోంది. నైతిక విలువలు మరిచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వ్యక్తులు ఓటర్లలో అపోహలు సృష్టస్తున్నారు. ఇలాంటి ప్రచారాలను ఖమ్మం ఓటర్లు సమర్థంగా తిప్పికొట్టారని భావిస్తున్నా. ఖమ్మం లోక్‌సభలో మహిళా అభ్యర్థినైన తనను ఎదుర్కొనే ధైర్యం లేక ఓటర్లను కొనుగోలు చేసేందుకు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారు’’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. వాస్తవానికి రేణక విజయం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం బాగానే కష్టపడ్డారు. మరి అక్కడ విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.