వనమా కు మంత్రి పదవి.. కేసీఆర్ ప్లాన్ ఇదే

September 18, 2019

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్రావుకు మంత్రి పదవి దక్కబోతుందా..? తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి సంబంధించిన విషయాలపై క్లారిటీకి వచ్చేశారా..? వనమాకు మంత్రి ఇవ్వాలన్న దానిపై కేసీఆర్ కొత్త ప్లాన్ వేస్తున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన లేఖను విడుదల చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరాలనుకుంటున్నట్టు అందులో తెలిపారు. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరతారని వనమా వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఎర్రవెల్లిలోని ఫాం హౌస్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వనమా వెంకటేశ్వరరావు కలిశారు. అనంతరం తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పక్షాన 88 మంది గెలుపొందగా, ఒక ఇండిపెండెంట్, మరో పార్టీ గుర్తుపై గెలిచిన ఒక ఎమ్మెల్యే వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరారు. రేగా కాంతారావు, ఆత్రం సక్కులతో మొదలైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వలసల సంఖ్య వనమాతో 8కి చేరింది.

ఇదిలాఉండగా, ఖమ్మం జిల్లాలో పట్టు లేక ఇబ్బందులు పడుతోంది అధికార టీఆర్ఎస్. ఈ క్రమంలో అక్కడ బలం పుంజుకోవడం కోసం జిల్లాలోని ఎమ్మెల్యేలు సహా కీలక నేతలను కారెక్కించడానికి ఆ పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. అలాగే ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. అయితే, వీరి చేరికలతో సంతృప్తి చెందని కేసీఆర్ సరికొత్త ప్లాన్ వేశారని తెలుస్తోంది. అదే.. వనమాకు మంత్రి పదవి కేటాయించడం. వనమాకు మంత్రివర్గంలో బెర్తు లభించే అవకాశాలున్నాయనే ప్రచారం టీఆర్‌ఎస్‌లో కూడా జరుగుతోంది. ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గంలో ఖమ్మం జిల్లాకు, మున్నూరు కాపు కులస్తులకు ప్రాతినిధ్యం లేదు. వనమాకు ఐదుసార్లు గెలిచిన సీనియర్‌ ఎమ్మెల్యేగా గుర్తింపు ఉంది. అందుకే ఆయనకు మంత్రి పదవి కేటాయిస్తే.. జిల్లాకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. దీనితో పాటు కాపు సామాజికవర్గాన్ని కూడా అక్కున చేర్చుకున్నట్లు ఉంటుంది. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు టాక్.