మోడీని వదిలి కేసీఆర్ ట్రంప్ ని ఎందుకు ఫాలో అవుతున్నారు?

May 28, 2020

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు గురించి తెలిసిందే. ఆయనకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఉంటుందన్నమాట ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తనకు నచ్చని వారి విషయంలో ట్రంప్ మాదిరే కేసీఆర్ సైతం కఠినంగా వ్యవహరిస్తారు. అంతేకాదు.. తనలోని లోపాల్ని ఎత్తి చూపే వారి విషయంలో ట్రంప్ ఎంతలా విరుచుకుపడతారో.. కేసీఆర్ తీరు అలానే ఉంటుందని చెప్పక తప్పదు.
ఎక్కడి దాకానో ఎందుకు? కరోనా విరుచుకుపడుతున్న వేళ.. అందరిని జాగ్రత్తగా ఉండాలని చెప్పే క్రమంలో తనకు తాను స్వీయజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. ఇలాంటివేమీ తనకు అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తారు ట్రంప్. తనకు మాస్కులు కట్టుకోవటం ఇష్టముండదన్న ఆయన మాటల్ని వింటే ఇంత బాధ్యతారాహిత్యమా? అనిపించక మానదు. ఓవైపు కరోనా విరుచుకుపడుతున్న వేళ..మాస్కుల వినియోగం ఎంత ముఖ్యమన్న విషయాన్ని మాటలతో చెప్పే కన్నా.. ముఖానికి మాస్కు కట్టుకుంటే కలిగే ప్రయోజనం ఎంతో.
వ్యక్తిగతంగా తనకు మాస్కు ఇష్టం లేదు కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ధరించనన్న మొండితనానికి తగ్గట్లే తాజాగా సీఎం కేసీఆర్ తీరు ఉందని చెప్పాలి. శనివారం ఉదయం దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా ముఖాన్ని క్లాత్ తో కట్టేసుకున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. మారిన పరిస్థితులకు తగ్గట్లు.. తానెంత భద్రమైన పరిస్థితుల్లో ఉన్నా.. జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి అన్న సందేశాన్ని ఇచ్చేలా ముఖానికి క్లాత్ కట్టేసుకున్నారు.
శనివారం రాత్రి ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన ముఖానికి ఎలాంటి మాస్కు ధరించకపోవటం గమనార్హం. ఒకపక్కన బయటకు వచ్చే వారంతా తప్పనిసరిగా ముఖానికి మాస్కు ధరించాలన్న మాట చెప్పే వేళలో.. అందుకు భిన్నంగా ముఖానికి ఎలాంటి మాస్కు పెట్టుకోకుండా ఉండటం ఎలాంటి సంకేతాన్ని ఇస్తుందో కేసీఆర్ ఆలోచించరా? అన్న సందేహం పలువురిలో వినిపిస్తోంది. ఈ ఒక్క విషయంలోనే కాదు.. ప్రశ్నలు సంధించే మీడియా ప్రతినిధులతో.. తన పనితీరును తప్పు పట్టే వారి విషయంలోనూ ట్రంప్ మాదిరే కేసీఆర్ తీరు ఉంటుందంటున్నారు. ట్రంప్ ను ఫాలో అయ్యే కంటే ప్రధాని మోడీని అనుసరించటం మంచిదన్న విషయాన్ని సారు ఎప్పటికి గుర్తిస్తారో?