పవన్‌తో చేదు జ్ఞాపకాల్ని చెరిపేస్తుందా?

August 07, 2020

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌త్ పని చేయడాన్ని ప్రతి సౌత్ ఇండియన్ హీరోయిన్ ఎంతో ఇష్టపడుతుంది. దాన్నో గొప్ప అవకాశంగా భావిస్తుంది. ఆయన రేంజ్ ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పవన్‌తో పని చేసే అవకాశాన్ని కెరీర్లో చాలా త్వరగానే అందుకుంది కీర్తి సురేష్. కానీ ఆ అవకాశం ఆమెకు ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. పవన్-కీర్తి కలయికలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. అందులో పవన్-కీర్తిల కెమిస్ట్రీ కూడా వర్కవుట్ కాలేదు. కీర్తి క్యారెక్టర్ కూడా ఏమంత బాగుండదా సినిమాలో. ఓ కాంబినేషన్లో ఇలాంటి డిజాస్టర్ వచ్చాక.. దాన్ని రిపీట్ చేయడానికి ఫిలిం మేకర్స్ ఇష్టపడరు. కానీ క్రిష్ అదేమీ పట్టించుకోకుండా తాను పవన్‌తో చేస్తున్న సినిమా కోసం కీర్తినే కథానాయికగా ఎంచుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కథానాయికగా ముందు కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కథానాయికగా కీర్తి సురేష్ ఖరారైందట. ఆమెకు నిర్మాత ఎ.ఎం.రత్నం అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ‘అజ్ఞాతవాసి’ వచ్చే సమయానికి కీర్తిపై పెద్దగా అంచనాల్లేవు. ఆమెను మామూలు హీరోయిన్‌గానే చూశారు. కానీ ఆ తర్వాత ఆమె ‘మహానటి’తో తిరుగులేని స్థాయిని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె ఇమేజే మారిపోయింది. ఇప్పుడు తనపై అంచనాలు పెరిగాయి. ఈ ఇమేజ్‌తో పవన్ పక్కన నటిస్తే ఆ ఆసక్తే వేరుగా ఉంటుంది. క్రిష్ లాంటి దర్శకుడి సినిమా అంటే పాత్ర బలంగా కూడా ఉంటుంది కాబట్టి ఈసారి కీర్తి తనదైన ముద్ర వేసి.. అందరి దృష్టినీ ఆకర్షించడం ఖాయం. మరి ‘అజ్ఞాతవాసి’ తాలూకు చేదు జ్ఞాపకాల్ని కీర్తి ఈసారి చెరిపి వేస్తుందేమో చూడాలి. ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ‘పింక్’ రీమేక్‌తో సమాంతరంగా పవన్ ఈ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.