బద్ధ శత్రువుతో కేజ్రీ మీటింగ్... ఇదీ విషయం

August 15, 2020

దేశంలో భిన్నమైన మార్గం, రాజకీయానుభవం ఏ మాత్రం లేకుండా హ్యాట్రిక్ సీఎంగా నిలబడిన వ్యక్తి కేజ్రీవాల్.  అవమానాలను ఎదుర్కోగలిగిన మానసిక దృఢత్వం, ఆధునిక రాజకీయాలను తిప్పికొట్టగలిగిన వ్యూహం, జనం ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూనే వారికి మంచి చేయడానికి తనంతట తాను నిర్మించుకున్న ఒక మార్గం కేజ్రీవాల్ విజయానికి దారితీసింది.

బీజేపీకి పంటికింద రాయిలా మారి... బీజేపీ జాతీయ నాయకత్వం, ప్రధాని కూర్చున్న రాష్ట్రాన్ని వరుసగా ఏలుతూ వారి పక్కలో బల్లెంలా తయారయ్యాడు కేజ్రీవాల్. మూడోసారి మాత్రం ప్రజలు ఆయనను కావాలని మనస్ఫూర్తిగా ఎన్నుకున్నారు. ఇందులో కేజ్రీ వ్యూహాల కంటే కేజ్రీ వారికోసం తపించి చేసిన పనులే గెలిపించాయి. ఇక బీజేపీకి మరో ఐదేళ్లు కేజ్రీ వేడిని భరించక తప్పదు. అందుకే జాతీయ స్థాయిలో లక్ష్యాలు పెట్టుకున్నపుడు కాస్త కేజ్రీతో వివాదాలు తగ్గించుకోవడమే మంచిదని బీజేపీ అధినాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు అర్థమవుతోంది. అందుకే ఇపై కేజ్రీపట్ల సానుకూలంగా ఉండాలని కేంద్రం డిసైడైనట్లుంది.

దీనికి సూచిక అన్నట్లు ఈరోజు కేజ్రీవాల్, బీజేపీ ప్రముఖ నేత, హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇరువురు చాలా సమయం చర్చించుకున్నారు. అమిత్ షా ఇంట్లోనే కేజ్రీ ఆయనను కలవడం విశేషం. వాస్తవానికి వీరి మధ్య సయోధ్యకు మరో బలమైన కారణం కూడా ఉంది. ఢిల్లీ పోలీసింగ్ మొత్తం కేంద్రం చేతులో ఉంటుంది. కాబట్టి ప్రస్తుత హోం మంత్రి అమిత్ షాతో సఖ్యత కేజ్రీకి అవసరమే. ఈ నేపథ్యంలో వారిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మీటింగ్ అనంతరం కేజ్రీవాల్ దీని గురించి వెల్లడించారు.

ఢిల్లీ భవిష్యత్ ప్రణాళికల గురించి ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించినట్లు చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి కోసం పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లి సంయుక్తంగా సమష్టిగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హోంమంత్రితో సమావేశం సంతృప్తికరంగా ఉందని వివరించారు. ఢిల్లీ ప్రజల సంక్షేమం కోసం ఇరు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని కేజ్రీవాల్ వెల్లడించారు. -