పాకిస్తాన్ కు మోడీ తరఫున కేజ్రీవాల్ వార్నింగ్

August 05, 2020

ఉద్యోగ జీవితం నుంచి వచ్చిన కేజ్రీవాల్ ఎమోషన్ పండించడంలో రాజకీయ నాయకులను మించిపోయారు. ఏ మాట ఎంత నష్టం చేస్తుందో పక్కాగా అర్థం చేసుకున్నారు కేజ్రీవాల్. అందుకే తన ప్రత్యర్థి పార్టీకి చెందిన బీజేపీ నేత మోడీని తన నోటితో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పొగడటం విచిత్రం. అయితే... మోడీ చేసిన అభివృద్ధి గురించో ఇంకో దాని గురించి కాదు. పాకిస్తాన్ జోక్యం గురించి మాట్లాడుతూ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ వచ్చాక పాకిస్తాన్ కి అన్నీ నిద్రలేని రాత్రులే. అందుకే ఆయనకు వ్యతిరేకంగా ప్రతి ఎన్నికలో పాకిస్తాన్ నాయకులు పనిగట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. తాజాగా ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఓ పాకిస్తాన్ నాయకుడు ఇలాగే స్పందించారు.

పాక్ మంత్రి ఫవాద్ ట్విట్టర్ వేదికగా మోడీని కామెంట్ చేశారు. అందులో  ’’ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా మోదీకి బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. కశ్మీర్, పౌరసత్వ చట్టాలు, ఆర్థిక సమస్యల మూలంగా ఇటు దేశంలో అటు  ప్రపంచ దేశాలనుంచి వస్తోన్న విమర్శల మూలంగా మోదీ మతి చలించిందంటూ.. అర్థంలేని వ్యాఖ్యలతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటను ఎక్కడ బీజేపీ తన అస్త్రంగా మార్చుకుంటుందో అని భావించిన కేజ్రీవాల్ పాకిస్తాన్ పై మండిపడ్డారు. ’రాజకీయాలు దేశభక్తికి అడ్డురావు. ఫవాద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఢిల్లీ ఎన్నికలు భారత్ అంతర్గత విషయం. మోదీ మా ప్రధానమంత్రి. ఆయనపై విమర్శలను మేము సహించం. మోడీ భారత ప్రధాని. ఆయన నాకు కూడా ప్రధానే' కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎన్నికలు భారత అంతర్గత విషయం. ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద కార్యకలాపాలకు స్థావరంగా పేరుపొందిన పాకిస్థాన్ మా ప్రజలు ఎవరికి ఓటేయాలో మీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదంటూ కేజ్రీవాల్ రిటార్ట్ ఇచ్చారు. కేజ్రీవాల్ నుంచి బీజేపీ ఈ రెస్పాన్స్ ఊహించలేదు.  కానీ కేజ్రీ అద్భుతంగా స్పందించి ఆ ఉచ్చు నుంచి సులువుగా బయటపడ్డారు.