జగన్‌పై కేశినేని సైటైర్ అదిరిపోయిందిగా...

May 22, 2020

రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడానికి గంటలుగంటలు మైక్ పట్టుకుని వాయించనవసరం లేదు.. ఒక్కటి సరైన పంచ్ వేస్తే చాలు.. అది కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే చాలు.. అని నిరూపించారు కేశినేని నాని. ప్రజావేదిక కూల్చివేతను ఇప్పటికే వ్యతిరేకించిన నాని తాజాగా తన ఫేస్‌బుక్ పేజీలో పెట్టిన చిన్న పోస్టుతో జగన్‌పై పదునైన బాణం వేశారు. యమునా నది ఒడ్డున ఉన్న తాజ్ మహల్ ఫొటో, ఆ కిందనే ప్రజావేదిక కూల్చివేత ఫొటో పెట్టి... ‘‘ఇంకా నయం తాజ్‌మహల్ ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో యమునా నది ఒడ్డున ఉంది కాబట్టి సరిపోయింది.. అదే కృష్ణానది ఒడ్డున ఉంటేనా’’ అని దానికి వ్యాఖ్య రాశారు.
నాని వ్యాఖ్య చాలా లోతైన భావాన్ని వ్యక్తపరిచింది. తాజ్ మహల్ కానీ ఇక్కడ కృష్ణానది ఒడ్డున ఉంటే దాన్ని కూడా కూల్చేసి ఉండేవారన్న అర్థంలో ఆయన సెటైరిక్‌గా చేసిన ఈ పోస్టింగును వేలాది మంది ఇప్పటికే లైక్ చేశారు.
కాగా.. ఇటీవల చంద్రబాబుపై అసమ్మతి స్వరం వినిపించి, ఫేస్ బుక్ పేజీల్లో కామెంట్లు పెట్టి వార్తల్లోకెక్కిన నాని ఇప్పుడు అదే ఫేస్ బుక్ వేదికగా చంద్రబాబుకు బ్రహ్మాండమైన డిఫెన్సు ఇచ్చారు. ప్రజావేదిక కూల్చివేత, చంద్రబాబు ఇంటికి దారి మూసివేతపై టీడీపీ నేతలు వైసీపీ, జగన్‌లపై విరుచుకుపడుతున్నా ఆ గొంతులు వినపడడం లేదు. చివరకు చంద్రబాబు కూడా ఈ పరిణామాలతో డీలా పడ్డారు. ఇలాంటి తరుణంలో ఊహించని విధంగా నాని ఈ విషయంలో చంద్రబాబుకు మద్దతుగా జగన్‌ను నేరుగా ఈ స్థాయిలో విమర్శించడం ఆసక్తిగొలుపుతోంది.
నిజానికి నాని ఇప్పటికే ప్రజావేదిక విషయంలో జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతూ తన అభిప్రాయాన్ని ఫేస్‌బుక్ ద్వారా పంచుకున్నారు. ప్రజావేదిక అక్రమమో, సక్రమమో పక్కన పెడితే.. అది ప్రజాధనంతో నిర్మించిన వేదిక. కాబట్టి ప్రజావేదికను తొలగించాలనుకుంటే, అక్రమ నిర్మాణాలన్ని తొలగించిన తర్వాత.. ప్రజావేదికను చివర్లో తొలగిస్తే బావుంటుందని కేశినేని నాని అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయన అదిరిపోయే సెటైర్‌తో జగన్, వైసీపీకి షాకిచ్చారు.