ఆ నలుగురిని గిల్లిన బెజవాడ లీడర్

July 05, 2020

అదేంటో అధికారం పోయాక తెలుగుదేశం నేతలు యాక్టివ్ అయ్యారు. ఉన్న అధికారం కాపాడుకోవడానికి ట్రై చేయని నేతలు... చేతిలో పవర్ పోయాక దాని విలువ తెలిసొచ్చి చాలా యాక్టివ్ అయిపోయారు. అలాంటి వారిలో ఒకరు తెలుగుదేశం నేత కేశినేని నాని. తొలుత నాని పోస్టులు చూసిన వారు అతను పార్టీ మారతాడేమో అనుకున్నారు. కానీ అతను పార్టీలో ప్రక్షాళన కోరుకున్నాడని తర్వాత అర్థమైంది. సైలెంట్ గా ఉన్నవారు పార్టీ మారారు కానీ నాని మాత్రం పార్టీ మారలేదు.
పైగా టీడీపీ తరఫున గవర్నమెంటును ప్రత్యర్థి పార్టీలను ఏకేస్తున్నారు. తాజాగా బడ్జెట్ నేపథ్యంలో నాని చాలా సెటైరికల్ గా స్పందించారు. పార్టీ ఫిరాయించిన టీడీపీ రాజ్యసభ ఎంపీలు సిగ్గుతో తలదించుకునేలా సెటైర్లు వేశారు. కానీ ఎక్కడా తిట్టకుండానే సున్నితమైన ఘాటైన విమర్శలు చేశారు.
లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ప్రవేశపెట్టిన 2019–20 బడ్జెట్‌ లో ఏపీని పూర్తిగా విస్మరించిన విషయం తెలిసిందే. జంపింగ్‌ ఎంపీలు పార్టీ మారినపుడు దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. దీంతో తాజాగా సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లకు ట్విటర్‌ వేదికగా నాని చురకలంటించారు.
‘మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్తున్నామని బిల్డప్‌ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్‌ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైంది. ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్లారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి చేరారో’ అంటూ ట్వీట్‌ చేశారు. నాని అభిప్రాయం ప్రజాభిప్రాయం ఒకటే కావడంతో ఆ పోస్టు వెంటనే వైరల్ అయ్యింది. తన మాజీ సహచరులు, రోజూ మొహం చూసుకునే వాళ్లే అయినా నాని వారిపై స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.