బాహుబలి ఇంటర్వెల్ బ్యాంగ్ తో చంద్ర బాబు హాట్ టాపిక్ !!

August 10, 2020

ఒక్కసారి నిజాలు చరిత్రకు ఎక్కితే చెరపడం సాధ్యం కాదు. సుమారు 15 వేల కోట్ల పెట్టుబడితో అనంతపురానికి చంద్రబాబు తెచ్చిన అతిపెద్ద పెట్టుబడి కియా. 2018 లో ఇండియాకు వచ్చిన పెట్టుబడుల్లో కియాదే టాప్. ఇంకా చెప్పాలంటే... ఈ దశాబ్దపు అతిపెద్ద పెట్టుబడుల్లో కియా ఒకటి. కేవలం 18 నెలల్లో కియా తన మొదటి కారును విడుదల చేసింది. అప్పట్లో కియాపై వైసీపీ అధినేత జగన్, వైసీపీ నెం.2 విజయసాయిరెడ్డి అనేక ఆరోపణలు చేశారు. చైనాలో మూతపడిన కంపెనీకి చంద్రబాబు వందల ఎకరాలు కట్టబెట్టాడు అని విజయసాయిరెడ్డి ఆరోపించిన కంపెనీ నేరుగా 11 వేల ఉద్యోగ అవకాశాలు సృష్టించగా... అనుబంధ పరిశ్రమలు, వాటిపై ఆధారపడిన ఇతర పనుల ఆధారంగా సుమారు లక్ష మందికి ఉపాధి కల్పించింది. 

వైఎస్ హయాంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరిట భూములు స్వాధీనం చేసుకుని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు వాడేసుకున్నట్లు ఆరోపణలు విన్నాం. అది కూడా ఇపుడు తెరపైకి వస్తోంది. ఆ తర్వాత బొత్స గతంలో మంత్రిగా ఉన్నపుడు వోక్స్ వ్యాగన్ కంపెనీ వెనక్కి వెళ్లిపోయేలా నిర్లక్ష్యం వహించిన విషయం కూడా ఇపుడు వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే... వైసీపీ కూడా ఈ క్రెడిట్ ను బాబు ఖాతాలోంచి తీసేయలేకపోతోంది. దీనికి కారణం... కియా ఆధారంగా చేసుకుని అప్పట్లో వారు విమర్శలు చేయడమే. ఇంత వేగంగా కియా వృద్ధి చెందుతుందని ఊహించని వైకాపా అనేక ఆరోపణలు చేసింది. ఇపుడు ఆ కల నెరవేరి తొలి కారు రోడ్డు మీదకు వచ్చేటప్పటికి అడ్డంగా బుక్ అయ్యింది. తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితి. దీనికి గతంలో వారు చేసిన ఆరోపణలు అడ్డొస్తున్నాయి.

ఈ పరిణామాలన్నింటినీ బాహుబలి 2 ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ తో పోల్చుతూ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. బల్లాల దేవుడు పట్టాభిషేకంలో బాహుబలికి జనం జేజేలు పలికినట్టు... ముఖ్యమంత్రి జగన్ అయినా.. కియా ఘనత గురించి సోషల్ మీడియా ఆ క్రెడిట్ ను చంద్రబాబుకు కట్టబెడుతూ #ThankyouCBNforKia అని ట్రెండ్ చేస్తోంది. చంద్రబాబు హయాంలో తొలి టెస్టింగ్ మోడల్ ను విడుదల చేశారు. ఈరోజు సెల్టోస్ పేరుతో మేడిన్ ఆంధ్రాకారు రోడ్డు ఎక్కనుంది. చంద్రబాబు పేరు ఎత్తకుండా ఉండే పరిస్థితి లేకపోవడంతో ముఖ్యమంత్రి ఈ ప్రోగ్రాంనే స్కిప్ చేశారు. ఏది ఏమైనా... చేసిన మంచిని చరిత్ర మరవదు అనడానికి కియా తార్కాణమై నిలుచుంది.