కియా...ఇప్పుడు ప్రారంభం ఏంద‌య్యా?

February 23, 2020

దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్ ఏపీలో మ‌రోమారు ప్రారంభోత్స‌వం చేసుకోనుంది! ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కియా మోటార్స్‌ ప్లాంట్లను సీఎం ప్రారంభించనున్నారు. పరిశ్రమ పురోగతి, కార్ల ఉత్పత్తి, సౌకర్యాలు, ఉద్యోగాల కల్పన తదితర విషయాలపై ‘కియా’ ప్రతినిధులతో సీఎం సమీక్షించనున్నట్లు స‌మాచారం. అయితే, ఇప్ప‌టికే ప్రారంభ‌మైన కియా ప్లాంటును మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్రారంభిస్తున్నారంటూ..సోష‌ల్ మీడియాలో ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో తొలి కారును ఆవిష్కరించిన కంపెనీ..  ‘సెల్టోస్‌ మిడ్‌–సైజ్‌ ఎస్‌యూవీ’ కారును భారత మార్కెట్లోకి ఈ ఏడాది ఆగ‌స్టులో ప్రవేశపెట్టింది. అనంతపురం ప్లాంట్‌ నుంచే త్వరలో దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతికానున్నట్లు సంస్థ ఎండీ, సీఈఓ కూక్‌ హున్‌ షిమ్ ఆ సందర్భంగా వెల్లడించారు. అయితే, తాజాగా అనంత‌పురం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మ‌ళ్లీ ప్రారంభించ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. నెటిజ‌న్ల కామెంట్ల‌కు అవ‌కాశం క‌ల్పించింది.
కాగా, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే తలంపుతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. ఈ నేప‌థ్యంలో అర్హులైన స్థానికులందరికీ ‘కియా’ పరిశ్రమలో ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ గ‌తంలో ప్ర‌క‌టించారు. మ‌రోవైపు వైసీపీకి చెందిన కొంద‌రు నేత‌లు కియాలో కొలువుల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో..సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌పై ఆస‌క్తి నెల‌కొంది.

ఈ సందర్భంగా రెండు పాత క్లిప్పింగులు కింది స్లైడ్ షోలో చూడండి. సరదాగా !