జడ్జిలను నరికేస్తారా!

August 13, 2020

ముక్కలు ముక్కలు చేయాలంటారా!
గదిలో బంధించి కరోనా రోగిని వదలాలా!?
ఎందుకూ పనికిరాని జడ్జిలంటూ తిట్లు
అసభ్య దూషణలు, అభ్యంతరకర వ్యాఖ్యలు
హద్దులు దాటుతున్న వైసీపీ నేతలు
కులం పేరెత్తి న్యాయమూర్తులపై ఆరోపణలు
ఇంటర్వ్యూలు, స్పీచ్‌లు, సోషల్‌ మీడియా పోస్టులు
బిత్తరపోతున్న ప్రజానీకం


అధికార మదం వైసీపీ నేతల తలకు బాగా ఎక్కింది. సీఎం నుంచి సాధారణ కార్యకర్త దాకా ఉచ్ఛం నీచం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు సహజమే. కానీ కోర్టులను, న్యాయమూర్తులను కూడా వారు వదలడం లేదు.

కేసుల్లో స్టేలు తెచ్చుకుని చంద్రబాబు బతుకుతున్నారని పదే పదే ఎద్దేవాచేసే వైసీపీ నేతలు.. ఏ-1 ముద్దాయి జగన్‌, ఏ-2 ముద్దాయి విజయసాయిరెడ్డి.. హైకోర్టు బెయిల్‌ ఇస్తేనే జైలు నుంచి విడుదలై బయట తిరుగుతున్నారన్న వాస్తవం మరచిపోయినట్లు ఉన్నారు.

ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకాకుండా జగన్‌ ఎన్ని సాకులు వెతుకుతున్నారో అందరికీ తెలుసు. ప్రభుత్వపరంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఏకపక్షంగా.. చట్టవిరుద్ధంగా ఉంటున్నాయి. ఇదే విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు తరచూ గుర్తుచేస్తున్నాయి.

తద్వారా తప్పులు దిద్దుకోవాలని మర్యాదగా హితవు పలుకుతున్నాయి. కానీ వైసీపీ నేతలు కుసంస్కారంతో న్యాయమూర్తులనే దూషించే స్థాయికి చేరుకున్నారు. కులం పేరుతో కూడా తిడుతున్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తదితరులు విలేకరుల సమావేశాల్లో తిడుతుంటే..

వైసీపీ అభిమానులు, కార్యకర్తలు ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెడుతున్నారు. తమ ప్రసంగాలు, ఇంటర్వ్యూలను కూడా పోస్టు చేస్తున్నారు. ‘హైకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉంటే అంతమందిని ముక్కలుగా నరకాలి.

అందరినీ నరకాల్సిందే. మొత్తం జడ్జిలను ఒక గదిలో పెట్టి... అదే గదిలో కరోనా రోగిని వదలాలి’ అని లని చందూరెడ్డి అనే వ్యక్తి ట్వీట్‌ చేశారు. హైకోర్టు జడ్జిలు ఎందుకూ పనికిరారంటూ బూతులు తిట్టి... కావాలంటే తననూ అరెస్టు చేసి సీబీఐ విచారణకు ఆదేశించుకోవచ్చని కిశోర్‌ రెడ్డి అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో సవాల్‌ చేశాడు.

సుప్రీంకోర్టు, హైకోర్టుకు చెందిన కొందరు జడ్జిలకు, హైకోర్టుకు కులం ఆపాదించారు. అవినీతి ఆరోపణలు చేశారు. మరిన్ని తప్పుడు ఉద్దేశాలను అంటగట్టారు. దూషించారు. విద్వేషం చిమ్మారు. ప్రాణహాని బెదిరింపులు చేశారు.


భారీస్థాయి కుట్ర..


కోర్టులు, న్యాయమూర్తులపై ఇంత విద్వేషం చిమ్ముతున్నారంటే దీనివెనుక భారీస్థాయి కుట్రే ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ‘తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో నందిగం సురేశ్‌ మాటలు ‘సాక్షి’ న్యూస్‌లో ప్రత్యక్షప్రసారమయ్యాయి.

ఆయన హైకోర్టుకు తప్పుడు ఉద్దేశాలను అంటగట్టారు. చంద్రబాబు నాయుడు హైకోర్టును మేనేజ్‌ చేస్తున్నారన్నారు. కోర్టు తీర్పులు చంద్రబాబు నాయుడుకు పది లేదా 30 నిమిషాల ముందే ఎలా తెలుస్తున్నాయని అన్నారు.

ఆయనపై విచారణ జరపాలని, కాల్‌ లిస్ట్‌ కూడా బయటపెట్టాలని నందిగం సురేశ్‌ అన్నారు. ఇదంతా చూస్తుంటే దీని వెనుక పెద్దస్థాయి కుట్ర ఉన్నట్లు అనిపిస్తోంది. వీడియో/క్లిప్పింగ్‌లు/పోస్టింగ్‌లు న్యాయస్థానం గౌరవాన్ని, జడ్జిల ప్రతిష్ఠను దెబ్బతీసేవే.

ఇది కోర్టు ధిక్కరణకు పాల్పడటమే’ అని హైకోర్టు సైతం వ్యాఖ్యానించింది. ఇప్పటివరకు 93 మందికి నోటీసులు జారీచేసింది.


‘‘విదేశీ యాప్‌లలో న్యాయవ్యవస్థకు భంగం కలిగించే వ్యాఖ్యలు పెడితే... ఆయా దేశాల్లో తక్షణమే అరెస్టు చేస్తారు. మన దేశంలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇనస్టాగ్రాం తదితర విదేశీ  సామాజిక మాధ్యమాల్ని వినియోగించి న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాం?

దీనిని అడ్డుకోలేమా?’’ అని హైకోర్టు ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. కనీసం ఆయా కంపెనీలపైనైనా చర్యలు తీసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

గత మార్చిలో ఇంగ్లీషు మీడియం అమలుపై హైకోర్టు తీర్పు వెలువరించినప్పుడు కొంతమంది సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేయగా, వారిపై హైకోర్టు రిజిసా్ట్రర్‌ జనరల్‌ (ఆర్‌జీ) రాజశేఖర్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారు.

సీఐడీ పోలీసులు ఏప్రిల్‌ 16, 18 తేదీల్లో మొత్తం ఏడుగురిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినప్పటికీ.. దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. దీనిపై ఆయన హైకోర్టులో అత్యవసర పిటిషన దాఖలు చేశారు. రాష్ట్ర డీజీపీ, సీఐడీ పని తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

సీఐడీ నమోదు చేసిన కేసుల్ని కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో దర్యాప్తు చేసే సంస్థకు బదిలీ చేయాలని అభ్యర్థించారు. పిటిషనలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలతో పాటు యూట్యూబ్‌, ట్విటర్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇనస్టాగ్రాం తదితర సంస్థలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.