ఏపీని అవినీతిమయం చేయ‌డ‌మే జ‌గ‌న్ ల‌క్ష్యం !!! - వైసీపీ నేత

February 19, 2020

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప‌రువు ఆ పార్టీకి చెందిన ఓ మ‌హిళా నేత తీసేశారు. ఆమె కావాల‌ని చేయ‌క‌పోయినా పొర‌పాటుగా చేసిన ఓ వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. వీటిని వైసీపీ యాంటీ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ చేస్తున్నారు. అస‌లు విష‌యంలోకి వెళితే కేంద్రమాజీ మంత్రి, వైసీపీ నేత కిల్లి కృపారాణి నోరు జారారు.
ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్య‌ను విన్న వైసీపీ నేత‌లు కాస్త షాక్ అయ్యారు. ఆమె త‌ప్పును స‌రిదిద్దిందుకు ప్ర‌య‌త్నాలు చేసినా ఆమె మాత్రం వారిని ప‌ట్టించుకోకుండా త‌న ప్ర‌సంగాన్ని కంటిన్యూ చేశారు. ఈ ప్ర‌సంగాన్ని ఎవ‌రో వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్ట‌డంతో ఇప్పుడు అది బాగా వైర‌ల్ అయ్యింది.
వైసీపీ యాంటీ ఫ్యాన్స్ దీనిపై ర‌క‌ర‌కాల కామెంట్లు పెడుతూ బాగా వైర‌ల్ చేస్తున్నారు. ఇక వైసీపీ నేత‌లు ఇలా నోరు జారీ ముఖ్య‌మంత్రికి మైన‌స్ అయ్యేలా చేయ‌డం ఇదే మొద‌టిసారి కాదు. గ‌తంలో న‌గ‌రి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా కూడా ఓసారి ఇలానే నోరు జారారు. ఇక ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ బాధ్య‌త‌లు చేప‌ట్టిన రోజున రోజా మాట్లాడుతూ ఆడవాళ్ల పుట్టుకను ముఖ్యమంత్రి అవమానిస్తాడని వ్యాఖ్యానించి కలకలం రేపారు.
ఆమె త‌న ప్ర‌సంగంలో క్లారిటీ లేకుండా మాట్లాడ‌డంతో ఆమె ఆ వ్యాఖ్య‌లు ఎవ‌రిని ఉద్దేశించి చేశారో తెలియ‌క అక్క‌డున్న వారంతా తిక‌మ‌క‌ప‌డ్డారు. ఇక తాజాగా కిల్లి కృపారాణి సైతం ముఖ్య‌మంత్రి ఏపీని అవినీతి రాష్ట్రంగా చేస్తార‌న్న వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో వైసీపీ నేత‌ల‌కు ఇబ్బందిగా మారింది.