ట్రంప్ దెబ్బకు కిమ్ కు తడిచిపోతోందా?

June 01, 2020

అగ్రరాజ్యమంటే అగ్రరాజ్యమే. ప్రపంచానికే పెద్దన్నగా ఉండే వారికెంతో పవర్ ఉంటుందో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూసిన చాలామందికి అర్థమైంది. అగ్రరాజ్యమన్న పదం వెనుకున్న పవర్ ఎలా ఉంటుందో? ప్రపంచాన్ని ఎలా సవారీ చేయొచ్చన్న విషయాన్ని అగ్రరాజ్యాధినేత ట్రంప్ తన చేతలతో చూపించటమే కాదు.. ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వారికి సైతం తన తెంపరితనంతో మరో షాకిచ్చారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే..తన మాటలతో.. చేతలతో తరచూ ప్రపంచ దేశ ప్రజల్ని కలవరపెట్టే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తాజాగా అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.  తన మాటలతో అదే పనిగా అగ్రరాజ్యానికి చిరాకు పుట్టించటమే కాదు.. చేతలతో మంట పుట్టేలా చేయటంలోనూ  కిమ్ కున్న ప్రత్యేకత అందరికి తెలిసిందే.
కొన్ని సందర్భాల్లో కిమ్ మాటలకు ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా ఇరాన్ మిలటరీ కమాండర్ ఖాసిం సాలేమానీని డ్రోన్ తో హతమార్చటం ద్వారా.. తాము టార్గెట్ చేయాలే కానీ.. ప్రపంచంలో ఏ మూల ఎవరున్నా.. వారిని వదిలేది లేదన్న సందేశాన్ని అగ్రరాజ్యం పంపింది. దీన్ని అర్థం చేసుకున్న కిమ్.. కనిపించకుండా పోయారంటున్నారు. ట్రంప్ దెబ్బకు దడిచారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

అమెరికాతో కయ్యం తన ప్రాణాల మీదకు తెస్తుందన్న విషయాన్ని అర్థం చేసుకున్న కిమ్.. కనిపించకుండా పోయారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ వాదనకు బలం చేకూరేలా ఉత్తర కొరియా మీడియా ప్రకారం గత ఏడాది చివరి రోజైన డిసెంబరు 31 తర్వాత కిమ్ ఎక్కడ ఉన్న విషయం బయటకు రాలేదంటున్నారు. గత సంవత్సరం చివరి రోజున వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ సెషన్ ముగిసిన తర్వాత ట్రంప్ మీద కిమ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది జరిగిన స్వల్ప వ్యవధిలోనే ఇరాన్ మిలటరీ జనరల్ ను ఇరాక్ లో ఏసేయటం సంచలనంగా మారింది.
మరోవైపు ఉత్తర కొరియాతో అణు ఒప్పందంపై చర్చలు జరిపేందుకు ట్రంప్ ఇచ్చిన గడువు ముగిసింది. కిమ్ దారికి రాకుంటే ఇరాన్ మిలటరీ కామాండర్ కు పట్టిన గతే కిమ్ కు ఉంటుందన్న వాదన వినిపిస్తున్న వేళ.. ఉత్తర కొరియా అధినేత అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోవటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. జనరల్ సోలేమనీని హతమార్చిన వైనంపై ఉత్తర కొరియా ఇప్పటివరకూ రియాక్ట్ కాకపోవటం అండర్ లైన్ చేసుకోవాలన్న మాట వినిపిస్తోంది.