కిరణ్ కుమార్ రెడ్డి కొత్త ఇన్నింగ్స్?

July 08, 2020

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో గత రెండు ఎన్నికలుగా ఒక్క సీటు కూడా గెలుచుకోలేక దాదాపు కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీని నడిపించే బాధ్యతను అధిష్ఠానం ఆయనకు అప్పగించడానికి సిద్ధమైందని తెలుస్తోంది. ఇంతవరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన రఘువీరారెడ్డి ఒంటరి పోరు సాగించి చివరకు ఆయన కూడా ఆశలొదిలేసి సొంతూరికి పరిమితం కావడంతో కొత్త నాయకుడికోసం పార్టీ చూస్తోంది. అయితే, పార్టీలో ఎవరూ యాక్టివ్‌గా లేకపోవడం.. అసలు చాలామంది నేతలు పార్టీ అధిష్ఠానాన్ని కలిసి సంవత్సరాలు గడిచిపోవడం.. ఫోన్లోనూ దొరక్కపోవడంతో పార్టీ ఉందా లేదా అన్నట్లుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞుడు, స్థిత ప్రజ్ఞుడు అయిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నెత్తికి పార్టీ పునరుజ్జీవ బాధ్యతలు అప్పగించాలని సోనియా గాంధీ డిసైడైనట్లు సమాచారం.
ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పళ్లంరాజు, చింతామోహన్, శైలజానాథ్ తదితరులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై ఇటీవ ఏపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జి ఊమెన్ చాంది సోనియాకు ఓ నివేదికను ఇచ్చారు. ఆయన పళ్లంరాజు, కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది.
నాయకులను మళ్లీ పార్టీలో యాక్టివేట్ చేసి తొలుత ఉనికి చాటుకునే పని మొదలు పెట్టాలన్నా కూడా ఛరిష్మా ఉన్న నాయకులెవరూ కనిపించడం లేదు. ఉన్నంతలో కిరణ్ కుమార్ రెడ్డి అయితే నయమనుకుంటున్న అధిష్ఠానం ఆయనకే పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కిరణ్ నియామకంపై రెండుమూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఈ ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టినట్లే.