సోషల్ మీడియా కేసులు - జగన్ పై కేంద్రం సీరియస్

August 07, 2020

జగన్ పై హోం మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్థానిక బీజేపీ నేతలు తరచుగా జగన్ పై శభాష్ జగన్ అంటుంటే సడెన్ గా కిషన్ రెడ్డి రాయలసీమకు వచ్చి మరీ జగన్ ను తీవ్రంగా విమర్శించి వెళ్లారు.

ఏపీలో పాలన సరిగా లేదు. పోలీసు రాజ్యం నడుస్తోంది. పోలవరం ప్రాజెక్టు పనులు జరగడం లేదు. కేంద్రం నిధులు ఇస్తున్నా పోలవరం పనులు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కిషన్ రెడ్డి తప్పుపట్టారు.
కేంద్రంలో ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చే ఏడాది గడిచిన సందర్భంగా నిర్వహించిన రాయలసీమ జోన్ జన సంవాద్ వర్చువల్ ర్యాలీలో పాల్గొన్న కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ తీరును తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసత్యాలతో జగన్ ప్రభుత్వం కాలం గడుపుతోంది అని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 
 
ఏపీలో అహంకారపూరితమైన,అభివృద్ధి నిరోధక పాలన నడుస్తోందని మండిపడ్డారు.  తప్పుడు కేసులు పెట్టి మరీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేసినా పోలీసులు కేసులు పెడుతూ వేధిస్తున్నారని, తనకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీలో అవినీతి, అరాచకం, దౌర్జన్యాలు రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. 
వైసీపీ పాలనలో అవినీతి వికేంద్రీకృతమై విజృంభిస్తోందన్నారు. పార్టీలు మారినా,నిరసనలు తెలియజేసిన, ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసినా కూడా కేసులు పెడుతున్నారంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.  దీన్ని బట్టి కేంద్రానికి జగన్ రెడ్డి మీద అనేక ఫిర్యాదులు గట్టిగా వెళ్లాయని... అర్థమవుతోంది.