వైసీపీ గాలి తీసే అప్ డేట్ ఇచ్చిన కిషన్ రెడ్డి

May 23, 2020

కరోనా వైరస్ కారణం చూపి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ నిమ్మగడ్డ మీద ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ఆ పార్టీ మద్దతుదారులు ఎలా విరుచుకుపడ్డారో తెలిసిందే. ముఖ్యమంత్రే అదుపు తప్పి మాట్లాడగా.. ఎంపీ విజయసాయి రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులు రమేష్‌ను ఉద్దేశించి దారుణమైన భాష వాడారు. కులం ప్రస్తావనతో ఆయనపై దూషణల పర్వానికి దిగారు. వీరి మాటల దాడికి, బెదిరింపులకు భయపడి తనకు రక్షణ కావాలంటూ రమేష్ కేంద్రానికి లేఖ రాసినట్లుగా రెండు రోజుల కిందట గట్టి ప్రచారం జరిగింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అసాధారణ రీతిలో ఏకగ్రీవాలు జరగడం గురించి కూడా రమేష్ ఆ లేఖలో ఫిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి.

రమేష్ పేరిట లేఖ సోషల్ మీడియాలోకి కూడా వచ్చింది. ఐతే ఈ లేఖ అబద్ధమని.. ఇది ఫేక్ అంటూ రమేష్ ఖండించినట్లు పేర్కొంటూ జగన్ అనుకూల మీడియాతో పాటు వైకాపా వాళ్లు తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేశారు. ఈ లేఖను ప్రచురించిన మీడియా మీద విమర్శలు గుప్పించారు. నిందలు వేశారు. చివరికి చూస్తే రమేష్ కేంద్రానికి ఈ లేఖ రాసినట్లు స్పష్టమైంది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డే ధ్రువీకరించారు. ఏపీ ఎన్నికల అధికారి నుంచి లేఖ అందినట్లు హోం శాఖ కార్యదర్శి చెప్పారని.. తనకు రక్షణ కోరుతూ లేఖలో వివిధ అంశాలు ప్రస్తావించారని.. దీనిపై హోంశాఖ స్పందించిందని.. రమేష్‌కు సరైన భద్రత కల్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయని. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో మార్గదర్శకాలు ఇస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఐతే రమేష్ లేఖ ఫేక్ అని, ఈ లేఖ పేరుతో ఎల్లో మీడియా రాద్దాంతం చేస్తోందని తీవ్ర పదజాలంతో దూషించిన, ఆరోపణలు చేసిన వైకాపా మద్దతుదారులు, అనుకూల మీడియా ప్రతినిధులు ఇప్పుడు ఏం సమాధానం ఇస్తారో మరి? 

 

కింద పడినా.. నాదే పైచేయి అన్నట్టు విజయసాయిరెడ్డి ఈ ట్వీటు చూడండి.

@VSReddy_MP

నిమ్మగడ్డ రాసినట్టు చెబుతున్న లేఖ ఎవరు సృష్టించినా, పంపినా క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదు. అందులో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ఆరోపణలు, ఆర్డినెన్స్ ను తప్పు పట్టే వ్యాఖ్యలున్నాయి. చంద్రబాబైనా, ఎలక్షన్ కమిషనర్ అయినా తప్పించుకోలేరు.

ఇది విజయసాయిరెడ్డి ట్వీటు.. ఇందులో ఏమైనా అర్థం పర్థం ఉందా? కేంద్రం కన్ ఫం చేశాక ఆ లెటరు గురించి ఏం చర్యలు తీసుకుంటారు? అసలు ఆర్డినెన్సు తెచ్చినందుకు కేంద్ర ఎన్నికల సంఘమే ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తోందని సమాచారం. అది రాజ్యాంగం అతిక్రమించి తెచ్చిన ఆర్డినెన్స్ అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.