చంద్రబాబును అడ్డుకోవడం అప్రజాస్వామికం: జయరాం కోమటి

August 03, 2020

తెలుగు దేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు విశాఖ ప‌ట్నంలో త‌ల‌పెట్టిన ప్ర‌జా చైత‌న్య యాత్ర‌ను వైసీపీ కార్య‌క‌ర్త‌లు అడ్డుకోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. అన్ని అనుమ‌తులు తీసుకున్న త‌ర్వాతే విశాఖ‌లో అడుగుపెట్టిన చంద్ర‌బాబును వైసీపీ నేత‌లు కుట్ర‌పూరితంగా అడ్డుకున్నార‌నే టీడీపీ నేత‌లు కార్య‌క‌ర్త‌లు ఆరోపిస్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వ‌చ్చిన చంద్ర‌బాబును అడ్డుకోవ‌డం స‌రికాదంటూ బీజేపీ, జ‌న‌సేన నేత‌లు, ప్ర‌జా సంఘాలు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించాయి. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌నను అడ్డుకోవ‌డాన్ని ఎన్నారై అమ‌రావ‌తి జేఏసీ నాయ‌కులు తీవ్రంగా ఖండించారు. ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో త‌ల‌పెట్టిన ప్ర‌జా చైత‌న్య యాత్ర‌ను భ‌గ్నం చేయ‌డంపై ఎన్నారై అమ‌రావ‌తి జేఏసీ నాయ‌కుడు జ‌య‌రాం కోమ‌టి  మండిప‌డ్డారు.

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను వైసీపీ నేత‌లు కావాల‌నే అడ్డుకున్నార‌ని జ‌య‌రాం కోమ‌టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బాధ్య‌త గ‌ల  ప్ర‌తిప‌క్ష పార్టీ అన్ని అనుమ‌తుల‌తో ఒక రాజ‌కీయ కార్య‌క్ర‌మాన్ని  నిర్వ‌హిస్తుంటే దానిని అడ్డుకొవ‌డం స‌రికాద‌ని అన్నారు. ఇటువంటి నియంతృత్వ విధానాల‌తో ఏపీ భ‌విష్య‌త్తు ఆందోళ‌న‌క‌రంగా మారింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇటువంటి చ‌ర్య‌ల వ‌ల్ల ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్టపోతార‌ని, నిరంకుశ విధానాలతో ఏపీలో ప్ర‌తిప‌క్ష‌మే లేకుండా చేయాల‌ని ప్ర‌భుత్వం యోచిక‌స్తోంద‌ని విమ‌ర్శించారు. ఏపీలో ప్ర‌తిప‌క్షం అన్న‌దే లేకుంటా ఇంకా ఇష్టారాజ్యంగా పాల‌న సాగించ‌వ‌చ్చ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల‌ను ఎత్తి చూపే బాధ్య‌త ప్ర‌తిప‌క్షానికి ఉంటుంద‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వారితో మ‌మేక‌మ‌య్యే హ‌క్కు ప్ర‌తిపక్షానికుంటుంద‌ని జ‌య‌రాం అన్నారు. అటువంటి ప్ర‌తిప‌క్షాన్ని కాపాడుకోవ‌ల‌సిన బాధ్య‌త ప్ర‌జ‌ల‌పై ఉంద‌ని, కానీ, ప్ర‌తిప‌క్షంతో ప్ర‌జ‌లు క‌ల‌వ‌కుండా వైసీపీ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారని, ప్ర‌తిప‌క్షాల‌కు స్వేచ్ఛ ఇవ్వాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదేన‌ని అన్నారు. చంద్ర‌బాబు చేప‌ట్టింది ప్ర‌భుత్వ వ్య‌తిరేక యాత్రో, నిర‌స‌న యాత్రో కాద‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు యాత్ర చేయ‌డం త‌ప్పు కాదని అన్నారు. బాధ్య‌త గ‌ల ప్ర‌భుత్వం....ఆ యాత్ర‌కు పోలీసుల ద్వారా అనుమ‌తిచ్చి....ర‌క్ష‌ణ క‌ల్పించాల్సింది పోయి...అడ్డుకోవ‌డం స‌రికాద‌ని అభిప్రాయ‌డ్డారు.