పేద బ్రాహ్మణులకు కోమటి జయరాం ఆపన్న హస్తం

August 10, 2020

కరోనాకు కనికరం లేదు....జాలి దయ అంతకన్నా లేదు...అందుకే కటిక పేదవాడి నుంచి కరోడ్ పతి వరకు ఎవరిపైనా వివక్ష చూపకుండా కాటేస్తోంది. కానీ, కరోనాను కట్టడి చేయడానికి విధించిన లాక్ డౌన్ మాత్రం నిరుపేదలకు ఒకలా...ధనికులకు మరోలా ఉంది. లాక్ డౌన్ వల్ల కరోనా బారిన పడకుండా సురక్షితంగా ఉన్నామని ధనికులు భావిస్తోంటే...లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నామని నిరుపేదలు, మధ్యతరగతి వారు, మరెందరో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొందరేమో నోరు తెరిచి సాయం అడుగుతుంటే...మరి కొందరేమో ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆకలితో అలమటిస్తున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ వల్ల బ్రాహ్మణులతో పాటు పలువురు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గౌరవప్రదంగా బ్రతికిన వారు చేయి చాచి సాయం అడగలేక....ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి పేద బ్రాహ్మణుల కుటుంబాలకు  ఎన్నారై కోమటి జయరాం ఆపన్న హస్తం అందించారు. ఆయనతో పాటు `వ్యాసపీఠం` గ్రూపు సభ్యులు విరాళాలు సేకరించి 70 బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం, దక్షిణ అందించారు.గోకుల్ రాచిరాజు NRI లతో మరియు వ్యాసపీఠం నాయకత్వం తో (VSN శాస్త్రి మరియు జంధ్యాల మోహన సాయి)సమన్వయ పరచారు

ఏడు పదుల వయసు దాటిన వృద్ధ బ్రాహ్మణులు కన్నీళ్లు పెడుతోన్న వీడియో చాలామందిని కదిలించింది. లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక....ఆత్మాభిమానం చంపుకోలేక....ఇబ్బందులు పడుతున్నామని ఆ వృద్ధులు చెప్పిన మాటు విని కంటతడి పెట్టని వారుండరు.  ఆకలికి కులం లేదు....మతం లేదు. చాలామంది వీడియోను చూసి కంటతడి పెట్టి ఆగిపోయి ఉంటారు.

"భావ గ్రాహీ జనార్దనః" కనుక...వారి హృదయం గ్రహించి జయరాం గారు పేద బ్రాహ్మణులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. "తేన త్యక్తేన భుంజీథాః", అని, "త్యాగేనైకేన అమృతత్వమానసుః", త్యాగము వల్లే అమృతత్వము కలుగుతుంది అనీ వేదం చెప్తోంది. 

లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేద బ్రాహ్మణులకు `వ్యాసపీఠం`, కోమటి జయరాం తరఫున నిత్యావసరాలు అందజేశారు. గోకుల్ రాచిరాజు సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. మల్కాజ్ గిరి, ఆర్కే నగర్, శివాలయం ప్రాంతాలలో నివసించే 70 బ్రాహ్మణుల కుటుంబాలకు 25 కేజీల బియ్యం, 15 రకాల నిత్యావసర సరుకులు, గొడుగులు పంపిణీ చేశారు.
పసుపు, కుంకుమ, విభూతి ప్యాకెట్ తోపాటు 101-00 దక్షిణ కూడా అందించారు. వివిధ దేశాల్లో నివసిస్తోన్న ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసుకున్న` వ్యాసపీఠం` సంస్థ  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మూడేళ్ల క్రితం వాట్సాప్ గ్రూపుగా ఏర్పడిన వ్యాసపీఠం అనతి కాలంలోనే ధార్మిక సంస్థగా మారి పలు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి కోమటి జయరాం గారు, వ్యాసపీఠం వాట్సాప్ గ్రూపు సభ్యులు, పలువురు విరాళాలందించారు. 

నిత్యావసరాల వివరాలు

బియ్యం 25కిలోలు
కందిపప్పు 1కేజీ
మినప్పప్పు 1 కేజీ
పెసరపప్పు 1 కేజీ
శెనగపప్పు. 2 కేజీ
చక్కెర.        1 కేజీ
బొంబాయి రవ్వ 1 కేజీ
బెల్లం.          1 కేజీ
గోధుమపిండి 1 కేజీ
సన్ ఫ్లవర్ ఆయిల్ 1 లీటరు
మిర్చి.              1/2 కేజీ
చింతపండు.     1/2 కేజీ
టీపొడి.             1/4 కేజీ
సాల్టు పేకెట్లు.     2
బాంబినో సేమ్యా. 1/2 కేజీ
గొడుగు.(బటన్ టైప్)   
 
ఆకలి బాధతో కన్నీళ్లు పెట్టుకున్న పూజారులు-Video Link