రెడ్డి నాయకులతో కోమటిరెడ్డి సంప్రదింపులు !

July 04, 2020

తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని... టీఆరెస్‌కు బీజేపీయే సరైన ప్రత్యామ్నాయమని సంచలన ప్రకటన చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఆ ప్రత్యామ్నాయ పార్టీలోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాను వెళ్లడమే కాకుండా తనతో పాటు కొందరు తన సామజికవర్గ నేతలనూ బీజేపీలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలంగాణ రాజకీయవర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మరో కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి)తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ఇద్దరు నేతల మధ్య ఏఏ అంశాలు చర్చకొచ్చాయన్నది తెలియాల్సి ఉంది. బీజేపీలోకి వెళ్దాం రమ్మని కోమటిరెడ్డి ఆహ్వానించినట్లుగా జగ్గారెడ్డి వర్గీయుల నుంచి వినిపిస్తోంది.
ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి, సీఎల్పీని తెరాసఎల్పీలో విలీనం చేయడంతో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కోమటిరెడ్డి, జగ్గారెడ్డి వంటివారూ పార్టీ మారితే తీరని నష్టం తప్పదు. అయితే... రాజగోపాలరెడ్డి నిజంగానే పార్టీ మారుతారా.. లేదంటే.. టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పార్టీని బెదిరించే కార్యక్రమానికి దిగారా అన్నదీ పార్టీలో చర్చకొచ్చినట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు రామచంద్ర కుంతియా రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆరా తీసినట్లు సమాచారం.
మరోవైపు కోదండరెడ్డి అధ్యక్షతన సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. పరిషత్‌ ఎన్నికల్లో గెలిచాక పార్టీ మారిన వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏం చేయాలనే దానిపైనా ఈ భేటీలో చర్చిస్తామని కోదండరెడ్డి అంటున్నారు.
మరోవైపు రాజగోపాలరెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడి వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. నేను మాత్రం కాంగ్రెస్‌ను వీడను. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతాననే నమ్మకంతోనే ఎంపీగా గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను. మరో నాలుగున్నరేళ్లలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం’’ అన్నారు. రాజగోపాలరెడ్డి పార్టీ మారుతారో లేదో తనకు తెలియదని.. ఒకే కుటుంబసభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉండడం కొత్తేమీ కాదన్నారు. మొత్తానికి ఈ అన్నదమ్ముల తీరు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని కన్ఫ్యూజ్ చేసి తమ కాళ్లు పట్టుకునేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.