కోమ‌టిరెడ్డి యూట‌ర్న్ వెనుక ఇంత క‌థ ఉందా?

February 22, 2020

కొద్ది కాలం క్రితం అనూహ్య‌మైన కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలిచిన కోమ‌టిరెడ్డి బ్ర‌దర్స్‌లో ఒక‌రైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి త‌న పొలిటిక‌ల్ కెరీర్‌పై యూట‌ర్న్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిచిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి...గ‌త కొద్దికాలం క్రితం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరతారని వార్తలు రావ‌డం, దీనికి ఆయ‌న చేసిన కామెంట్లే కార‌ణం కావ‌డం కూడా విదిత‌మే. అయితే, ఈ కామెంట్లను ఓ సంద‌ర్భంలో ఖండించారు. ఓసారి తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని.. మరోసారి బీజేపీ అనుకూలంగా కోమటిరెడ్డి చేసిన‌ వ్యాఖ్యలు ఆయన నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్‌నే ఆయోమయంలోకి నెట్టాయి. బీజేపీలోకి వెళ్ల‌డం కంటే సొంత గూటిలోనే ఉండ‌టం బెట‌ర‌ని కోమ‌టిరెడ్డి భావిస్తున్న‌ట్లు స‌మాచారం.
అనేక సంద‌ర్భాల్లో బీజేపీని పొగిడిన కోమ‌టిరెడ్డి కొద్దికాలం క్రితం తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న స‌మ‌యంలోనే కూడా బీజేపీపై త‌న భ‌క్తి చాటుకున్నారు. తిరుమ‌ల కొండ‌పైనే మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి  ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలపై ప్రశంసల వర్షం కురిపించారు. కాశ్మీర్‌కు స్వ‌యం ప్ర‌తిప‌త్తి ఉప‌సంహ‌ర‌ణ విష‌యంలో....ప్ర‌శంస‌లు కురిపించారు. ఆర్టిక‌ల్ 370, 35ఏ తొల‌గింపు అంశంపై మోడీ తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ హర్షిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమెరికా, చైనా తర్వాత భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి మోడీయే కారణమని ఆయ‌న ప్ర‌శంసించారు. మోడీ, షా నేతృత్వంలో భారత్ అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందని,  దేశ ప్రజలంతా మోడీ వైపే చూస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ప్రశంసించారు. బీజేపీలో చేరతారన్న వార్త‌ల‌పై స్పంద‌న కోర‌గా రాజగోపాల్ రెడ్డి మ‌ళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. పార్టీ మార్పు పై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానన్నారు.
అయితే, ఇప్ప‌టికీ ఆ స‌రైన స‌మ‌యం రాలేదా?  కోమ‌టిరెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆయ‌న బీజేపీలో చేరుతారా లేక కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతారా అనే ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం వ‌స్తోంది. బీజేపీ పెట్టిన ష‌రతులే...కోమ‌టిరెడ్డికి బ్రేకులు వేశాయ‌ట‌. పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా అయినా చేయాలి లేదంటే మూడోవంతు ఎమ్మల్యేలు బీజేపీలో చేరేలా చూడాలని పార్టీ పెద్ద‌లు ష‌ర‌తులు పెట్టార‌ట‌. దీంతో ఈ రెండూ త‌న‌తో సాధ్యం కావని గుర్తించిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవడమే బెటరనుకున్నారట‌. అయితే, ఇంత‌కీ కోమ‌టిరెడ్డి ప్ర‌స్తుతానికే పార్టీ మార‌కుండా ఉండిపోతున్నారా?లేక‌పోతే భ‌విష్య‌త్తులో కూడా మార‌కుండా ఉంటారా అంటే...కోమ‌టిరెడ్డికి సైతం పెద్ద గంద‌ర‌గోళం ఉంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.