అమరావతి- హైదరాబాదును ఏకం చేస్తా: కోమటి రెడ్డి

July 01, 2020

రాజకీయ నాయకులన్న తరువాత హామీలివ్వడం మామూలే. అయితే.. ఎలాంటి హామీలిస్తున్నామన్నదే అసలు విషయం. ఇచ్చే హామీ జనాల్లో నాటుకుపోతే ఇక ఆ నాయకుడికి తిరుగే ఉండదు. అలా కాకుండా అర్థంపర్థం లేని హామీలు, ఏమాత్రంఅర్థం కాని హామీలు.. ఎప్పుడో తరాలకు కానీ ప్రయోజనం అందించలేని హామీలు ఇస్తే వాటి వల్ల ఎన్నికల్లో తక్షణ లబ్ధి దొరకదు.
రాజకీయాల్లో కొద్దిమంది నేతలు మాత్రం ప్రజలను ఆకట్టుకునే, వారికి అవసరమయ్యే హామీలు ఇవ్వడంలో ముందుంటారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనూహ్య హామీ ఒకటి ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను గెలిస్తే హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా అమరావతికి రైలు మార్గం తీసుకొస్తానని అన్నారు. పోచంపల్లిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య సులభమైన రవాణా కోసం ఈ రైలు మార్గం తీసుకొస్తానని చెప్పారు. మూసీ నీటిని శుద్ధి చేయడానికి నదిపై ట్రీట్ మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయన ప్రస్తావిస్తూ, ప్రభుత్వం సరిగా పనిచేయాలంటే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి తమ పార్టీకి పట్టం కట్టాలని కోరారు.
భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి పోటీ చేస్తున్నప్పటికీ పాత నల్గొండ జిల్లా మొత్తం ప్రభావం చూపగలిగే నేత ఆయన. హైదరాబాద్ నుంచి ఆంధ్రకు వెళ్లే మార్గంలో ఉన్న నల్గొండ మీదుగా ఇప్పటికే విజయవాడ వెళ్లేందుకు రైలు మార్గం ఉంది. అయితే.. కోమటి రెడ్డి వెంకటరెడ్డి మాత్రం రోడ్డు మార్గాన్ని అనుసరిస్తూ విజయవాడ మీదుగా ఏపీ కేపిటల్ అమరావతి వరకు రైలు మార్గం ఏర్పాటు చేయిస్తానన్నట్లుగా హామీ ఇచ్చారు. మిగతా రాజకీయ పార్టీల్లోనూ ఈ హామీ ఇప్పుడు చర్చనీయంగా మారింది.