ఎవరు పెద్ద రౌడీ? చింతమనేనా? కోటంరెడ్డా?

February 28, 2020

విభజన తరువాత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడి అయిదేళ్ల పాలనలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి.. అంగన్వాడీ కార్యకర్తలను దూషించడం..  వంటి ఘటనలతో టీడీపీ హయాంలో చింతమనేనిని విపక్షాలు రౌడీ అని ఆరోపించేవి. వైసీపీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తరువాత చింతమనేనిపై కేసుల్లో విచారణ జరిపి ఆయన్ను అరెస్టు కూడా చేశారు. అయితే.. చింతమనేని తప్పులు తాజా కోటంరెడ్డి తప్పులతో పోలిస్తే... 1 పర్సెంట్ కూడా కాదని వైసీపీ అధినేత జగనే నిరూపించారు.

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి వ్యవహారం కూడా తీవ్ర వివాదాస్పదమవుతోంది. శుక్రవారం ఆయన ఓ మహిళా ఎంపీడీవో ఇంటిపైకి వెళ్లి దాడి చేయడం, సినిమాటిక్ అరాచకం చేయడం వివాదాస్పదమైంది. ఈ కేసులో ఆదివారం వేకువజామున ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సొంత ప్రభుత్వంలో అరెస్టయిన ఎమ్మెల్యేగా ఆయన పేరు ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. కోటంరెడ్డి వ్యవహారం ముదిరిపోతుండడంతో అది ప్రభుత్వానికి చెడ్డపేరు తేవకుండా ఉండేలా సీఎం జగనే ఆయన అరెస్టుకు ఆదేశించడంతో కోటంరెడ్డి అడ్డంగా బుక్కయ్యారు.
ఆది నుంచి వివాదాస్పదుడైన కోటంరెడ్డి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ నాలుగు నెలల్లో మరింత రెచ్చిపోతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఎస్ఐలు, సీఐలను బెదిరించిన ఘటనలు వంటివి కోటంరెడ్డి చరిత్రలో ఉన్నాయి. అయితే.. వైసీపీ పాలన మొదలైన తరువాత ఆయన దూకుడు మరింత పెరిగింది. జూన్ నెలలో తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని... తన రాజకీయ ప్రత్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి తరఫున పనిచేస్తున్నారని ఆరోపిస్తూ ఫయాజ్ అనే సీనియర్ జర్నలిస్టుకు ఫోన్ చేసి నానా బూతులు తిట్టారు కోటంరెడ్డి. ఆ తరువాత జమీన్ రైతు సంపాదకుడు నెల్లూరు డోలేంద్రప్రసాద్ అనే సీనియర్ జర్నలిస్టును కూడా తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారన్న కారణంతో చంపుతానని బెదిరించారు. ఇక రియల్ వ్యాపారులు, అధికారులను కూడా ఆయన బెదిరించారన్న ఆరోపణలున్నాయి. అధికారులు, ఉద్యోగులను అరేయ్, ఒరేయ్ అంటూ సంబోధిస్తూ బెదిరిస్తున్నప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం.. చంపుతామని బెదిరిస్తుండడంతో చాలామంది ఇప్పటికే భయంతో బయటకు చెప్పలేక కుమిలిపోతున్నారని.. ఎంపీడీవో సరళ ధైర్యం చేయడంతో కోటంరెడ్డి ఆగడాలు బయటపడుతున్నాయని నెల్లూరుకు చెందిన నాయకులు అంటున్నారు.