ఇసుక ఇష్యూ- జగన్ ను సొంత ఎమ్మెల్యే ఇరికించాడు

February 26, 2020

ఏపీలో జగన్ ప్రభుత్వం ఇసుక కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇసుక విధానంలో లోపాలు.. ఇసుక లభ్యత లేకపోవడంపై విపక్షాలు మండిపడుతూ ఉద్యమిస్తున్నాయి. ఇటు టీడీపీ, అటు జనసేన రెండూ ఇసుక విషయంలో ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాయి. దీంతో అటు పరిస్థితి చక్కదిద్దలేక.. ఇటు విపక్షాలకు సమాధానం చెప్పలేక వైసీసీ నేతలు ఇబ్బందిపడుతున్నారు. విపక్షాలకు తోడు ఇప్పుడు కొత్తగా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఇసుక విషయంలో తమ పార్టీకే చెందిన ఇతర నేతలపై ఆరోపణలు చేస్తుండడం వైసీపీని మరింత కలవరపెడుతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే తాజాగా ఇసుక విషయంలో చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపాయి.
ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటానికైనా సిద్ధమని చెప్పారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చినా ఫలితం లేకపోతుందన్నారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న ఇసుక అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టాలని చెప్పారు. ఇసుక విషయంలో విపక్షాలు ఆందోళనలు చేస్తున్న సమయంలో కోటంరెడ్డి కూడా అదే విషయంపై మాట్లాడడం వారి చేతికి ఆయుధమిచ్చినట్లుగా అవుతుందంటూ వైసీపీ నేతలు కోటంరెడ్డిని తప్పుపడుతున్నారు.
కాగా... ఇసుక సమస్యపై టీడీపీ నేతలు భారీ ఆశలు పెంచుకున్నారు. రాష్ట్రంలో త్వరలో ఇసుక తుఫాన్ రాబోతుందని, దీనికి తట్టుకొని వైసీపీ సర్కార్ నిలవలేదని టీడీపీ సీనియర్ నేత యనమల వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం జగన్ మధ్య చర్చలు ఏమీ జరగలేదని బీజేపీ నేతలు చెబుతుంటే, 45 నిమిషాల పాటు చర్చలు జరిగాయని వైసీపీ నేతలు అబద్దాలు చెబుతున్నారన్నారు. సీఎం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో డొల్లతనం ఉందని దీన్ని బట్టి తెలుస్తోందన్నారు. రాజధానిపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపదెబ్బ అని విమర్శించారు. లాయర్లకు కనీసం టీ కప్పులు కూడా దొరకడం లేదని హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు.