బుచ్చ‌య్య‌చౌద‌రికి భ‌లే మాట చెప్పిన కోటంరెడ్డి!

September 17, 2019

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర ఉదంతాల‌కు కొద‌వ‌లేదు. అసెంబ్లీ లాబీల్లో ప‌లు ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ ఆరంభం కావ‌టంతో అధికార‌.. విప‌క్షాల మ‌ధ్య స‌ర‌దా మాట‌లు.. చ‌తుర్లు చోటు చేసుకున్నాయి. నేత‌ల‌తో త‌మ‌కున్న అనుబంధం దృష్ట్యా చ‌నువుతో ఒక‌ట్రెండు మాట‌లు స‌ర‌దాగా అనుకోవ‌టం క‌నిపించింది.
అలాంటి వాటిల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి మాట‌లు ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించాయి. టీడీపీ సీనియ‌ర్ నేత‌.. అసెంబ్లీలో అదే ప‌నిగా ఆవేశ‌ప‌డుతూ మాట్లాడే ఆయ‌న ఎదురుప‌డినంత‌నే ఇరువురు ఆత్మీయంగా అభివాదం చేసుకున్నారు. అనంత‌రం వారి మ‌ధ్య స‌ర‌దా మాట‌లు చోటు చేసుకున్నాయి.
బుచ్చ‌న్నా.. బాగున్నావా? అంటూ బుచ్చ‌య్య చౌద‌రినికోటంరెడ్డి ప‌లుక‌రించ‌గా.. ఆయ‌న బాగున్నాన‌ని బ‌దులిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డికి అభినంద‌న‌లు తెలిపారు. వారిద్ద‌రు మాట్లాడుకుంటున్న స‌మ‌యంలో.. కోటంరెడ్డి.. అన్నా మీరు ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మేం అధికారంలోకి వ‌చ్చాం.. అధికార‌ప‌క్ష నేత‌లుగా మేం ఎలా ఉండాలో చెప్ప‌న్నా అని అడిగారు.
దీనికి బ‌దులుగా చిరున‌వ్వునే స‌మాధానంగా చెప్పారు బుచ్చ‌య్య చౌద‌రి. దీంతో మ‌ళ్లీ అందుకున్న కోటంరెడ్డి.. అన్నా అసెంబ్లీ రికార్డు పుస్త‌కాలు తెప్పించాను. గ‌తంలో ప్ర‌తిప‌క్షాన్ని మీరెన్ని తిట్లు తిట్టారో చూస్తాను. వాటికి మ‌రింత క్రీమ్ రాసి ఈ ఐదేళ్లూ మీపై సంధిస్తామ‌ని స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. దీనికి బ‌దులివ్వ‌ని బుచ్చ‌య్య‌.. న‌వ్వుతూ అక్క‌డ నుంచి వెళ్లిపోయారు.