సెలబ్రిటీలనే టార్గెట్ చేశాడు

September 17, 2019

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ల‌క్ష్మీపార్వ‌తి.. సినీ న‌టి పూన‌మ్ కౌర్ ల‌పై సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర రీతిలో వ్యాఖ్య‌లు చేసిన ఉదంతంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కోటేశ్వ‌ర‌రావు అలియాస్ కోటి తాజాగా నాంప‌ల్లి కోర్టులో లొంగిపోయాడు. ఇత‌డిపైన హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్లోరెండు కేసులు న‌మోద‌య్యాయి.
ప్ర‌ముఖుల‌తో ప‌రిచ‌యం చేసుకోవ‌టం.. వారికి న‌మ్మ‌క‌స్తుడిగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఆ త‌ర్వాత వారి న‌మ్మ‌కాన్ని త‌న దుర్మార్గ‌పు ఆలోచ‌న‌ల్ని అమ‌లు చేసి వారితో త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల్ని తీర్చుకుంటాడ‌న్న ఆరోప‌ణ‌లు కోటి మీద ఉన్నాయి. ల‌క్ష్మీపార్వ‌తి.. పూనం కౌర్ ల‌ను సోష‌ల్ మీడియాలో వేధించిన వ్య‌క్తి ఒక‌రేన‌న్న విష‌యాన్ని సైబ‌ర్ పోలీసులు గుర్తించారు.
సోష‌ల్ మీడియాలో త‌మ‌ను వేధిస్తున్నార‌ని.. అభ్యంత‌క‌ర‌మైన పోస్టులు పెట్టిన‌ట్లుగా ఫిర్యాదు చేశారు. దీనిపై సాంకేతికంగా ద‌ర్యాప్తు చేసిన పోలీసులు.. రెండు కేసుల్లోనూ ఒక‌రే నిందితుడిగా గుర్తించారు. అత‌డు కోటిగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు.
ఇంత‌లో లాయ‌ర్ తో పాటు వ‌చ్చి లొంగిపోతాన‌ని కొంత‌కాలం క్రితం వ‌ర‌కూ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చిన కోటి.. తాజాగా నాంప‌ల్లి కోర్టు ఎదుట లొంగిపోయారు. ఒక సామాన్యుడు ఇంత‌లా చేసే అవ‌కాశం లేద‌న్న మాట వినిపిస్తోంది. కోటి వెనుక ఉన్న‌ది ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం టీడీపీ నేత‌లు కొంద‌రు వైఎస్సార్ కాంగ్రెస్‌.. జ‌న‌సేనను టార్గెట్ చేసుకొని కోటిని ఉప‌యోగించి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. ప‌థ‌కం ప్ర‌కారం తాము టార్గెట్ చేసిన లక్ష్యాల కోసం.. కావాల‌నే ప‌రిచ‌యం చేసుకొని.. వారికి స‌హాయం చేసిన‌ట్లుగా న‌మ్మ‌కం క‌లిగిన త‌ర్వాత వారి ఫోన్ల‌లో త‌న‌కు కావాల్సిన అంశాల్ని పొందుప‌ర్చేవాడ‌ని తెలుస్తోంది. ల‌క్ష్మీపార్వ‌తి ఫోన్ ను కూడా అదే రీతిలో ఉప‌యోగించిన‌ట్లుగా ఆధారాలు ల‌భించాయ‌ని పోలీసులు పేర్కొన్నారు.
ల‌క్ష్మీపార్వ‌తి ఉదంతంలో పాటు.. పూన‌మ్ కౌర్ వ‌ద్ద కూడా టార్గెట్ చేసిన‌ట్లుగా మాట్లాడించి ఉంటార‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కోటిని పోలీసులు విచారించిన ప‌క్షంలో అన్ని అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. కోటి నోరు విప్పితే.. చాలా కుట్ర‌లు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.