కొత్తపల్లి గీత... 5 ఏళ్లు, 4 పార్టీలు

July 04, 2020

ఆమె రాజకీయ జీవితం కేవలం ఐదారేళ్లు. 

కానీ పాతికేళ్ల రాజకీయ జీవితంలో కూడా చోటుచేసుకోనన్ని మార్పులున్నాయి. 

తొలుత వైసీపీ... మధ్యలో టీడీపీ, ఆ తర్వాత కొత్త పార్టీ... ఇపుడు బీజేపీ. 

ఆ సంచలన తెలుగు నేత మాజీ మహిళా ఎంపీ కొత్త పల్లి గీత.

కొద్దిసేపటి క్రితం అమిత్ షా ను కలిసి బీజేపీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు కొత్తపల్లి గీత. తొలిసారి 2014లో వైసీపీ ఎంపీగా గెలిచిన గీత.. తెలుగుదేశంలో చేరి కొంతకాలానికి అక్కడ రాజీనామా చేశారు. ఆ తర్వాత సొంత పార్టీ పెట్టి మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అభ్యర్థులను నిలబెట్టారు. ఒక్క చోట కూడా డిపాజిట్టు దక్కలేదు. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోయారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆహ్వానం మేరకు ఆమె బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒక్కసారే ఎంపీగా చేసినా కేంద్రంలో బాగా పరిచయాలు పెంచుకున్నారావిడ. ముఖ్యంగా అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ వంటి నేతలను ఆమె తరచూ కలిసేవారు. పార్టీలో చేరిన అనంతరం ఆవిడ అమిత్ షా, రామ్ మాధవ్ లకు ట్విట్టర్ బీజేపీ వేదికగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.