గుంటూరు కృష్ణా ఎమ్మెల్యేలు పిరికిపందలు

February 17, 2020

గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి రాజధానిని తరలిస్తున్నా కూడా మారుమాట్లాడలేని పిరికిపందలు వైసీపీ ఎమ్మెల్యేలు అని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు.  సీఎం జగన్ పై ఒత్తిడి తీసుకురావడానికి మీకు ధైర్యం లేదా? మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు అన్యాయం చేస్తున్న మీకు జీవితంలో మరోసారి ఓటేయించుకునే హక్కును కోల్పోయారని లోకేష్ అన్నారు. మీకు జగన్ ను ఒప్పించే దమ్మూధైర్యం లేకపోతే రాజీనామా చేసిపోండి... మళ్లీ మిమ్మల్ని ప్రజలు ఇండిపెండెంట్ గా గెలిపిస్తారు అని లోకేష్ వ్యాఖ్యానించారు.

 

రౌడీలో చెప్పులు, రాళ్లు ప్రతిపక్ష నేత మీద విసిరితే అది రాజ్యాంగం ఇచ్చిన నిరసన తెలిపే హక్కు అని చెప్పే డీజీపీ... రైతులకు నిరసన తెలిపే హక్కు ఉందని గుర్తించడం లేదని, శాంతియుతంగా ధర్నా చేస్తున్న మమ్మల్ని ఏ సెక్షన్ల కింద అరెస్టు చేశారో చెప్పాలని విడుదలైన అనంతరం లోకేష్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక ఎఫ్ఐఆర్ లేదు. ఒక కాగితం లేదు. ఒక కారణం లేదు. నిరసన తెలిపితే అరెస్టులా... ఇది ప్రజాస్వామ్యమా రాజరికమా అని లోకేష్ ప్రశ్నించారు.

పదహారు నెలలు చిప్పకూడు తిన్నవారు సెక్యూరిటీ పెట్టుకుని దర్జాగా తిరుగుతున్నారు... ఒక్క తప్పు చేయకుండా, ఏ నాడూ జైలుకు వెళ్లని మేము రైతుల కోసం పోరాడుతుంటే పోలీస్ స్టేషన్లో కారణం లేకుండా నిర్బంధించారు. అణిచివేస్తే ఆగే ఉద్యమం కాదిది అని లోకేష్ హెచ్చరించారు.