కృష్ణ కిశోర్ కేసు - జగన్ ని రఫ్పాడిస్తోంది

February 19, 2020

నిజమే... ఏపీకి వచ్చి డిప్యూటేషన్ పై పనిచేస్తున్న ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్ తో పెట్టుకుని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద తప్పే చేశారని చెప్పక తప్పదు. చంద్రబాబు సీఎంగా ఉండగా కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి డిప్యూటేషన్ పై వచ్చిన కృష్ణ కిశోర్... ఏపీఈడీబీ సీఈఓగా పనిచేశారు. చంద్రబాబు విదేశీ పర్యటలను దగ్గరుండి మరీ పర్యవేక్షించిన కిశోర్... ఏపీకి పెట్టుబడులు తీసుకురావడంలో కీలక భూమిక పోషించారని చెప్పక తప్పదు. అయితే తనపై నమోదైన ఆదాయానికి మించి ఆస్తులున్న కేసుల్లో కీలక సాక్ష్యాధారాలను సేకరించారన్న ఒకే ఒక్క కారణంతో జగన్ ఆయనపై కక్ష పెంచుకున్నారట. 

తాను సీఎం అయ్యే నాటికి ఇంకా రాష్ట్ర సర్వీసుల్లోనే ఉండిపోయిన కృష్ణ కిశోర్ పై కక్షసాధింపు మొదలెట్టేసిన జగన్... ఉన్నపళంగా కృష్ణ కిశోర్ ను సస్పెండ్ చేయడంతో పాటుగా ఆయనపై ఏకంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించేశారు. అంతేకాకుండా ఈ కేసుల దర్యాప్తు పూర్తి అయ్యే దాకా అమరావతిని వదిలి వెళ్లరాదని కృష్ణ కిశోర్ పై ఆంక్షలు విధించారు. దీనిపై న్యాయపోరాటం ప్రారంభించేసిన కిశోర్ ఇప్పటికే జగన్ సర్కారుపై చాలా విజయమే సాధించేశారు. హైకోర్టును ఆశ్రయించిన ఆయన తనను అరెస్ట్ చేయకుండా జగన్ సర్కారును నిలువరించే విషయంలో కిశోర్ ఇప్పటికే సక్సెస్ అయ్యారు. 

తాజాగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ ను కూడా కిశోర్ ఆశ్రయించారు. తనపై జగన్ సర్కారు కక్షసాధింపుతో దర్యాప్తులకు తెర తీసిన వైనాన్ని ఆయన క్యాట్ కు నివేదించారు. కిశోర్ వాదనతో ఏకీభవించిన క్యాట్... జగన్ సర్కారుకు చీవాట్లు పెట్టేసింది. కిశోర్ ను రాష్ట్ర సర్వీసుల నుంచి ఎందుకు రిలీవ్ చేయలేదని జగన్ సర్కారును ప్రశ్నించిన క్యాట్... ఈ విషయంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదని కూడా నిలదీసింది. ఈ విషయాలపై తక్షణమే వివరణ ఇవ్వాలని కూడా జగన్ సర్కారుకు క్యాట్ శ్రీముఖాలు పంపింది. మొత్తంగా కిశోర్ వ్యవహారంలో మొన్న హైకోర్టు నుంచి షాక్ తిన్న జగన్ సర్కారు... తాజాగా క్యాట్ నుంచి చీవాట్లు తిన్నది. అంటే... కిశోర్ తో పెట్టుకుని జగన్ చాలా పెద్ద తప్పే చేశారన్న మాట.