‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ రిలీజవ్వదా?

May 27, 2020

వివాదాల వీరుడు రామ్ గోపాల్ వర్మ ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో  కొత్త సినిమా తీసి విడుదలకు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లు నెల కిందటే ప్రకటించాడు వర్మ. వారం కిందటి వరకు ఆ రిలీజ్ డేట్‌తోనే ప్రమోషన్లు చేశాడు. రెండో ట్రైలర్లో కూడా అదే తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఉన్నట్లుండి ఈ సినిమాను వర్మ పక్కన పెట్టేశాడు. రిలీజ్ వీక్‌లో ప్రమోషన్ల జోరు ఇంకా పెరుగుతుందనుకుంటే.. ఐదు రోజులుగా ఈ సినిమా ఊసే ఎత్తట్లేదు వర్మ. తన సినిమాల విడుదల దగ్గర పడితే వర్మ ఎలా విజృంభిస్తాడో.. ఎలా వివాదాలు రాజేసి ఆ మంటలో సినిమాను పబ్లిసిటీ చేసుకుంటాడో తెలిసిందే. అలాంటిది వర్మ ఉన్నట్లుండి ‘కమ్మ రాజ్యంలో కడపు రెడ్లు’ సినిమా గురించి మాట్లాడకుండా సైలెంట్ అయిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

ఈ వారం రావాల్సిన మిగతా సినిమాలకు ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెనయ్యాయి. వర్మ సినిమా బుక్ మై షోలో అసలు కనిపించడం లేదు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు దగ్గర బ్రేక్ పడిందని.. ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఈ సినిమా విడుదలకు క్లియరెన్స్ వచ్చే అవకాశమే లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు ప్రధానంగా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను టార్గెట్ చేసిందే అయినా.. ఇది రిలీజైతే కొంత మేరకు తమకు కూడా డ్యామేజ్ జరిగేందుకు ఆస్కారం ఉందని.. ఈ చిత్రం విషయంలో జగన్ సర్కారు కూడా ప్రతికూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సెన్సార్ క్లియరెన్స్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో విడుదలకు ఏర్పాట్లు కూడాా ఆగిపోయాయట. ఈ వారానికైతే ఈ సినిమా రిలీజయ్యే ఆస్కారమే లేదన్నది స్పష్టం. మరి అన్ని అడ్డంకుల్నీ తొలగించుకుని ఈ సినిమా ఎప్పటికి థియేటర్లలోకి దిగుతుందో చూడాలి.